సర్వీసు ఫీజులు చెల్లించలేదని ప్లేస్టోర్ నుంచి యాప్‌లు తొలగించడంపై కేంద్రం సీరియస్ అయింది. టెక్, స్టార్టప్ కంపెనీలకు చెందిన యాప్‌లను గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొలగించిన వ్యవహారంలో కేంద్ర ఐటీ, టెలికాం మంత్రి అశ్వినీ వైష్ణవ్ తప్పుపట్టారు.త్వరలో గూగుల్ ఉన్నతాధికారులు, టెక్ కంపెనీల సీఈవోలతో ఓ సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.
స్టార్టప్ ఎకో సిస్టమ్ దెబ్బతినే విధంగా గూగుల్ వ్యవహరించడంపై అశ్వినీ వైష్ణవ్ మండిపడ్డారు. స్టార్టప్‌ల భవిష్యత్తుతో ఆడుకోవద్దన్నారు. ఇలాంటి వ్యవహారాలను క్షమించేదిలేదన్నారు. యాప్‌లను తొలగించడాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేదే లేదన్నారు.
30 శాతం దాకా ఉన్న ఫీజులను తగ్గించాలని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దీంతో గూగుల్ ఇండియా ఫీజులను 26 శాతానికి తగ్గించింది. పలు కంపెనీలు ఇప్పటికే గూగుల్ చర్యలపై న్యాయపోరాటానికి దిగాయి. కేంద్రం జోక్యంతో కొన్ని యాప్‌లను గూగుల్, రీస్టోర్ చేసింది. మరికొన్నింటిని పునరుద్దరించాల్సి ఉంది.