తెలంగాణ ఇంటర్మీడియేట్ బోర్డు, విద్యార్థులకు శుభవార్తం
చెప్పింది. పరీక్షకు సంబంధించి నిమిషం నిబంధనను ఎత్తివేస్తున్నట్లు తెలిపింది. పరీక్షా
కేంద్రానికి ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చిన విద్యార్థులను అనుమతించాలని ఇంటర్
బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది.
ఉదయం తొమ్మిది గంటల లోపు పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలనే ఇంటర్
బోర్డు గత నిర్ణయంతో పలువురు విద్యార్థులు నష్టపోయారు.
ఆలస్యంగా వచ్చిన తనను పరీక్షకు
అనుమతించకపోవడంతో ఆదిలాబాద్ కు చెందిన ఓ
విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. దీంతో ఈ నిబంధనపై పలువురు
విద్యావేత్తలు, విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో ప్రభుత్వం ప్రస్తుతం
సడలింపు ప్రకటించింది. 9 గంటల తర్వాత ఐదు
నిమిషాలు ఆలస్యంగా వచ్చినా పరీక్ష కేంద్రంలోకి అనుమతించాలని జిల్లా
విద్యాధికారులు, చీఫ్ సూపరింటెండెంట్లకు ఆదేశాలు జారీ చేసింది.
జవాబు పత్రాల మూల్యాంకనం ఈ నెల నాలుగో తేదీ నుంచి ప్రారంభం
అవుతుందని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. తెలంగాణ వ్యాప్తంగా 1521 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిన ఇంటర్
బోర్డు, గట్టి నిఘా ఏర్పాటు చేసింది. సీసీ
కెమెరాలతో పాటు ఎగ్జామ్ సెంటర్ల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.
మొదటి ఏడాది పరీక్షలకు 4,78,718
మంది హాజరవుతుండగా రెండో సంవత్సరం పరీక్షలు 5,02,260
మంది రాస్తున్నారు. రెండో ఏడాది
ప్రైవేటుగా పరీక్షలు రాసేవారు 58,071
మంది ఉన్నారు. పరీక్షల భయం పొగొట్టేందుకు ‘టెలీ మానస్’ పేరుతో టోల్ ప్రీ నంబర్
ఏర్పాటు చేశారు.