కాంగ్రెస్ సీనియర్ నేతల వీడియో పోస్ట్‌పై కేంద్ర ఉపరితల రవాణా మంత్రి గడ్కరీ సీరియస్ అయ్యారు. తాను మాట్లాడిన వీడియోను, ఎడిట్ చేసి అర్థం మారేలా చేసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, కాంగ్రెస్ జాతీయ కార్యదర్శి జైరాం రమేశ్‌కు లీగల్ నోటీసులు పంపించారు.
దేశంలో పేదలు, కూలీలు, రైతులు సంతోషంగా లేరంటూ, గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు సరిగా లేవని, ఆసుపత్రులు, పాఠశాలలు సక్రమంగా లేవంటూ తాను మాట్లాడినట్లుగా ఓ వీడియోను ఎడిట్ చేసి, తన పరువుకు భంగం కలిగించడంతోపాటు, బీజేపీలో నాయకుల మధ్య సైద్ధాంతిక విభేదాలు సృష్టించే విధంగా వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంపై కేంద్ర మంత్రి గడ్కరీ న్యాయపరమైన చర్యలకు ఉపక్రమించారు.తాను మాట్లాడిన సందర్భాన్ని చెప్పకుండా, అర్థం మార్చి వేసి వీడియోను సోషల్ మీడియాలో పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేతలకు నోటీసులు పంపించారు. వెంటనే క్షమాపణలు చెప్పాలని గడ్కరీ కోరారు.