Trinamool Tried To Save Sheikh Shahjahan, slams PM Modi
హిందూమహిళలపై అత్యాచారాలు, భూముల కబ్జా వంటి
ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ షాజహాన్‌ను రక్షించడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రయత్నించిందంటూ
ప్రధానమంత్రి నరేంద్రమోదీ మండిపడ్డారు. సందేశ్‌ఖాలీ వ్యవహారంలో టీఎంసీ వైఖరిపై ఆయన
తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసారు.
పశ్చిమబెంగాల్లోని ఆరాంబాగ్లో ఒక కార్యక్రమంలో
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పాల్గొన్నారు. ఆ సందర్భంగా ప్రసంగిస్తూ సందేశ్‌ఖాలీలో
మహిళల బాధల కంటె ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి కొందరి ఓట్లే ముఖ్యమా అని ఆ రాష్ట్ర ప్రజలు
అడుగుతున్నారంటూ మోదీ వ్యాఖ్యానించారు. సందేశ్‌ఖాలీ వ్యవహారం మీద ఇండీ కూటమి
నాయకులు ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీసారు.
తృణమూల్ కాంగ్రెస్ నినాదం ‘మా, మాటీ, మనుష్’ను
(తల్లి, నేల, ప్రజలు) గుర్తుచేస్తూ ప్రధాని ‘‘తృణమూల్ కాంగ్రెస్ ఎప్పుడూ మా, మాటీ,
మనుష్ గురించి మాట్లాడుతూ ఉంటుంది. కానీ ఆ పార్టీ సందేశ్‌ఖాలీలో మహిళలను అవమానించిన
తీరు దేశం అంతటికీ బాధనూ, ఆగ్రహాన్నీ కలిగించింది. ఈ పార్టీ వారి చేతలు చూసి రాజా రామ్మోహన్
రాయ్ ఆత్మ కన్నీళ్ళు పెట్టి ఉంటుంది’’ అని ఆవేదన వ్యక్తం చేసారు.
‘‘తృణమూల్ కాంగ్రెస్ నాయకుడొకరు సందేశ్‌ఖాలీలో మహిళలపై
అత్యాచారాలు చేయడంలో అన్ని హద్దలూ దాటేసాడు. ఆ మహిళలు తమ బాధలను చెప్పుకుని, మమతా
దీదీ సహాయం అడిగితే, ఆ నాయకుణ్ణి రక్షించడానికి ఆవిడ, మొత్తం బెంగాల్ ప్రభుత్వం
తాము ఏం చేయగలరో అవన్నీ చేసారు. ఆ మహిళల కోసం పోరాడింది, వారితో పాటు దాడులకు
గురయిందీ బీజేపీ నాయకులు మాత్రమే. బీజేపీ నాయకుల ఒత్తిడి వల్ల మాత్రమే బెంగాల్
పోలీసులు నిందితుణ్ణి అరెస్ట్ చేయక తప్పలేదు’’ అని మోదీ చెప్పుకొచ్చారు.
సుమారు రెండు నెలలుగా పరారీలో ఉన్న షేక్ షాజహాన్‌ను
రక్షించడానికి తృణమూల్ పార్టీ అన్ని ప్రయత్నాలూ చేసిందని మండిపడ్డారు. ‘ప్రతీ
గాయానికీ ప్రజలు తమ ఓటుతో జవాబివ్వాలి’ అని పిలుపునిచ్చారు.
తృణమూల్ పార్టీ భాగస్వామిగా ఉన్న ఇండీ కూటమి మీద
కూడా మోదీ మండిపడ్డారు. ‘‘గాంధీగారి మూడు కోతుల్లా వాళ్ళు తమ కళ్ళు, చెవులు, నోరు
మూసుకున్నారు. వాళ్ళందరూ కలిసి పట్నా, బెంగళూరు, ముంబై ఇంకా చాలాచోట్ల సమావేశాలు
పెట్టారు. కానీ, వామపక్షాలైనా లేక కాంగ్రెస్ అయినా బెంగాల్ ప్రభుత్వాన్ని కానీ
లేదా ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కానీ ప్రశ్నించే ధైర్యం చేసారా?’’ అని నిలదీసారు.