రష్యా ప్రతిపక్ష నేత నావల్నీ కుటుంబ సభ్యులను కష్టాలు వెంటాడుతున్నాయి. ఎట్టకేలకు నావల్నీ మృతదేహాన్ని పుతిన్ ప్రభుత్వం వారి కుటుంబ సభ్యులకు అప్పగించింది. వారు నావల్నీ మృతదేహాన్ని వాహనంలో శ్మశానానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. ముందుగా ఒక వేదికపై ప్రజల సందర్శనార్థం ఉంచాలని చూశారు.ప్రభుత్వానికి భయపడి చాలా మంది వేదిక ఇవ్వడానికి ముందుకు రాలేదు. ఎట్టకేలకు ఓ వేదిక లభించింది. వాహనం సిద్దం చేశారు. కానీ వాహనం నడిపేందుకు డ్రైవర్లు ముందుకు రావడం లేదు. బెదిరింపు కాల్స్ వస్తున్నాయని అందుకే ఎవరూ రావడం లేదని నావల్నీ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
ఇవాళ సాయంత్రానికి నావల్నీ అంత్యక్రియలు పూర్తి చేయాలని కుటుంబ సభ్యులు నిర్ణయించారు. మాస్కోలోని బోరిసోవ్ శ్మశాన వాటికల్లో అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.
పుతిన్ అరాచక పాలనపై ప్రతిపక్ష నేతగా నావల్నీ తీవ్ర విమర్శలు చేశారు. అతనిపై అనేకసార్లు హత్యాయత్నాలు కూడా జరిగాయి. అయినా ప్రజల గొంతుకగా నిలిచాడు. 2021లో నావల్నీపై విషప్రయోగం కూడా జరిగింది. వెంటనే చికిత్స చేయడంతో ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఇటీవల ఫిబ్రవరి 16న సైబీరియాలోని పీనల్ కాలనీలో నావల్నీ అనుమానాస్పదంగా చనిపోవడం ప్రపంచాన్ని నివ్వెరపరచింది. ఇది రష్యా అధికారపార్టీ హత్యగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ తీవ్ర విమర్శలు చేశారు.