పొరుగుదేశం బంగ్లాదేశ్‌లో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. రాజధాని ఢాకాలోని ఏడు అంతస్తుల రెస్టారెంట్లో గురువారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. రెస్టారెంట్‌లో చెలరేగిన మంటల్లో కాలిపోయి 44 మంది ప్రాణాలు కోల్పోయారు. 40 మంది గాయపడ్డారు. మరో 75 మందిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు. గ్యాస్ లీక్ వల్లే అగ్ని ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలోని బెయిలీ రోడ్డులోని ప్రముఖ రెస్టారెంట్‌లో అగ్నిప్రమాదం జరిగిందని అగ్నిమాపక అధికారి మహమ్మద్ షిహబ్ మీడియాకు వెల్లడించారు. కింది అంతస్తుల్లో మొదలై పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి. రెండు గంటల్లోనే మంటలను అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు. అగ్నిప్రమాదం జరిగిన రోడ్డులో రెస్టారెంట్లు, బట్టల దుకాణాలు అధిక సంఖ్యలో ఉన్నాయి. మంటలను వెంటనే అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది.
ఆరో అంతస్తులో చెలరేగిన మంటల నుంచి రక్షించుకునేందుకు కొందరు కిందకు దూకేయడంతో ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు నీటి పైపులను పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నారని ప్రత్యక్ష సాక్షి చెప్పారు. కొందరు భవనంపై అంతస్తులకు చేరుకుని ప్రాణాలు రక్షించుకున్నారని రెస్టారెంట్ యజమాని తెలిపారు.