The Anti-Indian Natasha Kaul not allowed into India
బ్రిటిష్ విద్యావేత్త నితాషా కౌల్ మొన్న ఆదివారం
సంచలనం సృష్టించారు. బెంగళూరు విమానాశ్రయం నుంచి భారతదేశంలోకి అడుగుపెట్టనివ్వకుండా
తనను వెనక్కు పంపించేసారు. దాంతో భారతదేశంలో మేధోవర్గాలను అణచివేస్తున్నారంటూ
సోషల్ మీడియాలో కల్లబొల్లి యేడ్పులు ఏడవడం మొదలుపెట్టారామె. ఇంతకీ ఎవరీ నితాషా
కౌల్? అసలావిడ మన దేశానికి ఎందుకొచ్చింది? ఆమెను మన దేశపు గడ్డ మీద అడుగుపెట్టనివ్వకుండా
ఎందుకు వెనక్కు పంపేసారు?
భారతీయ మూలాలు గల నితాషా కౌల్, ఇంగ్లండ్ లండన్‌లోని
యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్మిన్స్టర్లో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. కశ్మీరీ
కుటుంబంలో పుట్టిన నితాషా కౌల్, అంతర్జాతీయ వ్యవహారాల పేరిట భారత వ్యతిరేక వ్యాసాలు
వ్రాసి ప్రచారం చేస్తుంటారు. కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నెల 24, 25
తేదీల్లో బెంగళూరులో ‘కాన్స్టిట్యూషన్ అండ్ నేషనల్ యూనిటీ కన్వెన్షన్ 2024’ పేరిట
సదస్సు ఏర్పాటు చేసింది. అందులో వక్తగా పాల్గొనడానికి నితాషా కౌల్‌ను
ఆహ్వానించింది. దానికోసం బెంగళూరు చేరుకున్న నితాషాను కెంపెగౌడ విమానాశ్రయం
అధికారులు నగరంలోకి అడుగు పెట్టనివ్వలేదు. వెనక్కు లండన్ పంపించివేసారు. దాంతో
ఆదివారం నాడు నితాషా భారత ప్రభుత్వం తన హక్కులను అణచివేస్తోందంటూ గగ్గోలు మొదలుపెట్టింది.
నితాషా కౌల్‌కు భారత వ్యతిరేక ప్రచారం చేయడంలో
ఘనమైన చరిత్ర ఉంది. కశ్మీర్లో భారతదేశం అనుసరించిన విధానాలను ఆమె అనుక్షణం
తూర్పారబట్టింది. అసలు ఆమె తన అన్ని రచనల్లోనూ కశ్మీర్‌ను భారత పాలనలోని కశ్మీర్
అనే వ్యవహరిస్తుంది. ప్రత్యేకించి కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక
ఆమె ఏడుపులు తారస్థాయికి చేరుకున్నాయి. కశ్మీర్లో మానవహక్కులను
హరించివేస్తున్నారనీ, అక్కడ మైనారిటీలైన ముస్లిములకు రక్షణ లేదనీ, నిరసన స్వరాలను
అణచివేస్తున్నారనీ పుంఖానుపుంఖాలుగా రాసింది. అమెరికా విదేశీ వ్యవహారాల కమిటీ,
దక్షిణాసియాలో మానవహక్కుల గురించి నిర్వహించిన సదస్సులో కూడా అవే ఆరోపణలు చేసింది.
భారతదేశంలో ఎన్నికల వ్యవస్థను విమర్శించడం ఆమె నిత్యకృత్యం.
‘‘భారతదేశపు పాలనలో ఉన్న కశ్మీర్లో ఎన్నికల
నిర్వహణ సమాజాన్ని సమూలంగా విభజించివేస్తోంది. అక్కడ ఎన్నికలు నిర్వహించడమంటే
1947, 1948లలో ఆ ప్రాంతంలో ప్రజాభిప్రాయ సేకరణ చేపడతామని భారతదేశం, పాకిస్తాన్‌లు
ఐక్యరాజ్యసమితి తీర్మానం మేరకు ఇచ్చిన హామీలను నిరర్ధకం చేయడమే అవుతుంది. ఆ
ఎన్నికల్లో పాల్గొనడమంటే కశ్మీర్ భారతదేశపు పాలనలో ఉందన్న విషయాన్ని ఒప్పుకోవడమే.
కాబట్టి ఆ ఎన్నికలను పలువురు బహిష్కరించారు. అయితే భారతదేశానికి అనుకూలంగా ఉండే
కొంతమంది కశ్మీరీలు మాత్రం ఆ ఎన్నికల్లో పాల్గొన్నారు. అలాంటి భారత అనుకూల నాయకులు
సైతం ఇప్పుడు అరెస్ట్ అయి ఉన్నారు. వారిని ఎంతకాలం చెరలో ఉంచుతారో తెలియదు.
దాన్నిబట్టే, కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి ఇవ్వకూడదన్న తమ ఉద్దేశానికి ప్రజామోదం
లేదన్న విషయం భారత ప్రభుత్వానికి తెలుసని అర్ధమవుతోంది. కశ్మీర్ భూభాగంలో
ప్రజలందరినీ నిర్బంధించి, వారిపై నిర్బంధ పరిపాలనను రుద్దడం ప్రజాస్వామ్యం
అనిపించుకోదు, నిరంకుశత్వం అవుతుంది’’ అని నితాషా కౌల్ అమెరికా ప్రభుత్వం ముందు
భారతదేశంలో మానవహక్కుల ఉల్లంఘన జరిగిపోతోందంటూ కేకలు పెట్టింది.
నితాషా కౌల్‌కు గత పదేళ్ళుగా భారతదేశం బీజేపీ
పరిపాలనలో ఉండడం అనే విషయం పుండుమీద కారం రాసినంత మంట కలిగిస్తోంది. అందుకే ఆమె
భారతదేశంలో వలస పాలన కొనసాగుతోందంటూ దుష్ప్రచారం చేస్తోంది. బీజేపీ కశ్మీర్లో ప్రజల
నిరసన స్వరాలను అణిచేస్తోందంటూ నిరంతరాయంగా రాస్తూ ఉంటుంది. భారతదేశంలో ముస్లిములను
చంపేస్తున్నారంటూ ప్రచారం కొనసాగిస్తోంది. ‘‘ముస్లిం, క్రైస్తవ మైనారిటీలను
భారతదేశంలో శత్రువుల్లా చూస్తారు. తమ అజెండాకు ఆటంకం కలిగించే అడ్డంకులుగా
పరిగణిస్తారు. ముస్లిములు, క్రైస్తవులు భారతదేశంలో ప్రతీరోజూ వివక్షను,
హింసాకాండను సహిస్తున్నారు, భరిస్తున్నారు. అలాంటి సంఘటనలు విపరీతంగా
పెరిగిపోయాయని భారత్‌కు చెందిన మేధావులు, హక్కుల సంఘాలు, వార్తాసంస్థలూ
వెల్లడిస్తున్నాయి. బీజేపీ ప్రభుత్వపు ప్రధాన లక్ష్యం ఒక్కటే… భారత్‌లో మతపరంగా అతిపెద్ద
మైనారిటీ వర్గమైన ముస్లిములను రాక్షసులుగా చిత్రీకరించడం, వారిని అణగద్రొక్కేయడం. ఎంతోమంది
ముస్లిములను హత్య చేసారు. ఆ దుండగులను శిక్షించడానికి బదులు, అధికార బీజేపీ
సభ్యులు అలాంటి చర్యలను సమర్ధిస్తారు, కొన్నిసందర్భాల్లో ఆ నేరస్తులను మహానుభావులుగా
కీర్తిస్తారు’’ అంటూ అమెరికా ప్రభుత్వం ముందు బూటకపు ప్రేలాపనలు పేలింది.
మౌలికంగా పాకిస్తాన్ సానుభూతిపరురాలైన నితాషా
కౌల్ భారతదేశం గురించి చేసిన ఇలాంటి వ్యాఖ్యలను చూస్తే, ‘‘భారత రాజ్యాంగం, జాతీయ
సమైక్యత’’ అనే అంశంపై ఆమె ఎలా ప్రసంగిస్తుందో ఊహించడం కష్టమేమీ కాదు. కర్ణాటకలోని
కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే ఆమెను పిలిచిందనీ ఇట్టే అర్ధమైపోతుంది.
ఇలాంటి దుష్టశక్తులను దూరం పెట్టడం కోసమే ఆమెను భారత భూభాగంపైకి అనుమతించలేదన్న
సంగతీ స్పష్టమవుతుంది. తను పుట్టిన దేశం గురించే ప్రపంచం అంతటా దుష్ప్రచారం చేయడమే
జీవిత లక్ష్యంగా పెట్టుకున్న ఇలాంటి సోకాల్డ్ మేధావులను మన నేల మీద అడుగు
పెట్టనీయకపోవడం సరైనదే. అందుకే భారత విదేశాంగ శాఖ తగిన సమయంలో తగిన నిర్ణయం
తీసుకుంది. బెంగళూరు కెంపెగౌడ విమానాశ్రయంలో దిగిన నితాషా కౌల్‌ను భారత గడ్డపై
అడుగుపెట్టనివ్వకుండా ఇంగ్లండ్‌కు వెనక్కు తిప్పి పంపించేసింది.