Famous Ghazal Singer
Pankaj Udhas passes away
గజల్ గానంలో అంతర్జాతీయ ప్రసిద్ధి గాంచిన
ప్రఖ్యాత గాయకుడు పంకజ్ ఉధాస్ మరణించారు. పద్మశ్రీ పురస్కార గ్రహీత పంకజ్ ఉధాస్
వయసు 72 సంవత్సరాలు.
దీర్ఘకాలిక అనారోగ్యం కారణంగా పంకజ్ ఉధాస్
కన్నుమూసారని ఆయన కుమార్తె నయాబ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ముంబలోని
బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఈ ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు.
పంకజ్ ఉధాస్ హిందీ చలనచిత్రాల్లో నేపథ్యగాయకుడిగా
ప్రజారంజక గీతాలు ఎన్నింటినో ఆలపించారు. నామ్, సాజన్, మొహ్రా వంటి సినిమాల్లో ఆయన
పాడిన పాటలు శ్రోతలను ఎంతగానో అలరించాయి.
చాందినీ రాత్ మే, నా కజరే కీ ధార్, ఔర్ ఆహిస్తా
కీజియే బాతే, ఏక్ తరఫ్ ఉస్‌కా ఘర్, థోడీ థోడీ పియా కరో వంటి గజళ్ళతో పంకజ్ ఉధాస్
గాత్రం శ్రోతలను ఉర్రూతలూగించింది.
హిందీ చలనచిత్ర, గజల్ సంగీతానికి చేసిన సేవలకు
గాను పంకజ్ ఉధాస్‌ను భారత ప్రభుత్వం 2006లో పద్మశ్రీ పురస్కారంతో సన్మానించింది.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, పంకజ్ ఉధాస్‌తో తన
అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆయనకు నివాళులర్పించారు. ‘‘పంకజ్ ఉధాస్‌జీ గానం
విస్తృతమైన భావోద్వేగాలను పలికిస్తుంది. ఆయన గజళ్ళు నేరుగా హృదయాన్ని తాకేవి.
భారతీయ సంగీతానికి ఆయన దివిటీ పట్టారు. ఆయన మధుర గీతాలు తరతరాలకూ వ్యాపించింది. సంగీత
ప్రపంచంలో ఆయన లేని లోటు తీరనిది. ఆయనతో ఎన్నోసార్లు ముచ్చటించిన సందర్భాలు
గుర్తొస్తున్నాయి. ఆయన కుటుంబానికి, ఆయన అభిమానులకు నా సానుభూతి. ఓం శాంతి’’ అని
మోదీ ట్వీట్ చేసారు.