పశ్చిమబెంగాల్ సిలిగురి జూ పార్కులో సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టి ఓకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడంపై దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. మగ సింహానికి అక్బర్, ఆడ సింహానికి సీత పేర్లు పెట్టడంపై కొన్ని హిందూ సంఘాలు కలకత్తా హైకోర్టును ఆశ్రయించాయి. ఇలాంటి పేర్లు పెట్టడాన్ని కోర్టు తప్పుపట్టింది.
ఈ వ్యవహారం తీవ్ర నిరసనలకు దారితీయడంతో సింహాలకు పేర్లు పెట్టి, పశ్చిమబెంగాల్‌కు పంపిన త్రిపుర ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సింహాలకు అక్బర్, సీత పేర్లు పెట్టిన త్రిపుర అటవీ శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్‌పై వేటు పడింది.
పలు రాష్ట్రాలు జంతువుల మార్పిడిలో భాగంగా పశ్చిమబెంగాల్ అధికారులు, త్రిపురలోని సిఫాహీజలా జంతు ప్రదర్శనశాల నుంచి రెండు సింహాలను సిలిగురి తీసుకువచ్చారు. సింహాలకు వివాదాస్పదంగా పేర్లు పెట్టడంతోపాటు, ఆ రెండు సింహాలను సిలిగురి జూ అధికారులు ఒకే ఎన్‌క్లోజర్‌లో ఉంచడం ఆ వివాదానికి ఆజ్యం పోసింది.
ఈ ఘటనపై విచారణ జరిపిన కలకత్తా హైకోర్టు, సింహాలకు వివాదాస్పద పేర్లు పెట్టడాన్ని తీవ్రంగా తప్పుపట్టింది.లేని వివాదాలను ఎందుకు సృష్టిస్తారంటూ కోర్టు ప్రశ్నించింది.వెంటనే పేర్లు మార్చాలని ఆదేశించింది. త్రిపుర నుంచి సింహాలను తెచ్చే సమయానికే వాటికి ఆ పేర్లు ఉన్నాయని పశ్చిమబెంగాల్ ప్రభుత్వం చెప్పుకొచ్చింది. వాటిని వెంటనే మారుస్తామని కోర్టుకు వివరించింది.