అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవం జరిగి నెల
రోజులు అయింది. గడిచిన నెల రోజుల్లో బాలరాముడిని 60 లక్షల మంది భక్తులు
దర్శించుకున్నారు. భక్తులు అయోధ్య రాముడికి రూ.25 కోట్ల విలువైన విరాళాలు సమర్పించారు.
కానుకల్లో
25 కిలోల బంగారం, వెండి ఆభరణాలతో పాటు
చెక్కులు, డీడీలు, నగదు రూపంలో
విరాళాలు అందినట్లు అయోధ్య రామాలయ ట్రస్ట్ అధికారి ప్రకాశ్ గుప్తా వెల్లడించారు.
ట్రస్ట్ బ్యాంకు ఖాతాలలోకి నేరుగా పంపిన ఆదాయం
గురించి తమకు వివరాలు తెలియవని స్పష్టం చేశారు. కానుకలు, విరాళాలు లెక్కించడం
కోసం ఎస్బీఐ నాలుగు ఆటోమేటిక్ హైటెక్నాలజీ కౌంటింగ్ మెషిన్లు ఏర్పాటు చేసింది.
శ్రీరామనవమి వేడుకల సందర్భంగా బాలరాముడిని దాదాపు
50 లక్షల మంది దర్శించుకునే
అవకాశం ఉందని ఆలయ ట్రస్ట్ సభ్యులు అంచనా వేస్తున్నారు.
రామ్ లల్లాకు కానుకుల రూపంలో అందిన బంగారం, వెండి, ఇతర విలువైన
వస్తువులను కరిగించి నిర్వహణ కోసం భారత ప్రభుత్వానికి అప్పగించనున్నారు. ఈ మేరకు
నిర్ణయం తీసుకున్నట్టు రామాలయ ట్రస్టీ
అనిల్ మిశ్రా తెలిపారు.