మాజీ క్రికెటర్ నవజోత్ సింగ్ సిద్ధూ మీద దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాన్ని ఢిల్లీ హైకోర్టు కొట్టేసింది. ఆయుర్వేద పద్ధతిలో ఆహారం తీసుకోవడం మంచిదంటూ సిద్ధూ చేసిన వ్యాఖ్యలను సవాల్ చేస్తూ ఆయన మీద పిల్ దాఖలైంది. ఆ పిల్‌ను డిస్మిస్ చేసిన ఢిల్లీ హైకోర్టు, సిద్ధూ తన వ్యాఖ్యలను సామాజిక మాధ్యమాల్లోనుంచి తొలగించాలని సూచించింది.
సిద్ధూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ స్టేజ్4 క్యాన్సర్ పేషెంట్. ఆమె వైద్య చికిత్స తీసుకుంటూ ఆయుర్వేదం సూచించిన విధంగా ఆహారం తీసుకుందని, దాంతో ఆమె క్యాన్సర్ నుంచి బైటపడిందనీ సిద్ధూ ప్రకటించారు. అయితే, అటువంటి ప్రకటనలు క్యాన్సర్ చికిత్స గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసే ప్రమాదం ఉందంటూ పిటిషనర్ ప్రజాహిత వ్యాజ్యం దాఖలు చేసారు. దాన్ని విచారించిన ద్విసభ్య ధర్మాసనం, సిద్ధూ తన వ్యక్తిగత అభిప్రాయాన్ని చెప్పారని, ఆయన భావప్రకటనా స్వేచ్ఛను నిరాకరించలేమనీ స్పష్టం చేసింది.
‘‘సిద్ధూ కేవలం తన అభిప్రాయాన్ని చెప్పారు. ఆ తర్వాత ఆయన తాను వైద్యుల సలహాలు తీసుకున్నానని కూడా చెప్పారు. అది ఆయన భావప్రకటనా స్వేచ్ఛ. మీరూ మీకున్న అదే స్వేచ్ఛతో ఆయన అభిప్రాయాలను ఎదుర్కొనవచ్చు. ఈ దేశంలో భావప్రకటనా స్వేచ్ఛ అందరికీ ఉంది. అది మా పరిధిలోకి రాదు’’ అని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మన్మోహన్ చెప్పారు.
సిద్ధూ భార్య స్టేజ్4 క్యాన్సర్ నుంచి కోలుకున్నారు. దానికి కారణం ఆయుర్వేద ఆధారిత ఆహారాన్ని అనుసరించడమే అని సిద్ధూ చెప్పారు. మూలికలతో చేసిన ద్రవాలు, వేప, పసుపు వంటి పదార్ధాలు, ఉపవాసం వంటి ఆయుర్వేద ఆహార పద్ధతిని అనుసరించడం వల్ల తన భార్య త్వరగా కోలుకుందని సిద్ధూ చెప్పారు. తాము అనుసరించిన డైట్ చార్ట్ వల్ల ప్రజలకు మేలు కలగవచ్చని భావిస్తున్నానంటూ దాన్ని సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు.
సిద్ధూ భార్యకు క్యాన్సర్ నుంచి కోలుకునేందుకు 3శాతం మాత్రమే అవకాశాలున్నాయని వైద్యులు చెప్పారు. అయితే చికిత్సతో పాటు జీవన విధానంలోనూ, ఆహార పద్ధతుల్లోనూ మార్పులు చేసుకోవడంతో ఆమెకు పూర్తిగా నయమైంది.
‘‘కార్బోహైడ్రేట్స్, రిఫైన్డ్ మైదా, రిఫైన్డ్ చక్కెర, రిఫైన్డ్ నూనెలు, శీతల పానీయాలు, పాలు, పాల ఉత్పత్తుల కారణంగా క్యాన్సర్ రోగుల్లో ఇన్ఫ్లమేషన్ (మంట) వస్తుందని తెలుసుకున్నాం. నా భార్య ఆహారంలో వాటిని పూర్తిగా వదిలేసాం. ఆమెకు పూర్తిగా ప్రాచీన దేశీయ పద్ధతిలో… నిమ్మకాయతో గోరువెచ్చని నీరు, వేప, పచ్చి పసుపు, వెల్లుల్లి వంటి పదార్ధాలతో ఆహారం అందించాం’’ అని సిద్ధూ తన సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొన్నాడు. ఆ తర్వాత పాజిట్రాన్ ఎమిషన్ టోమోగ్రఫీ స్కానింగ్ చేయించామని చెప్పాడు. ఆ స్కానింగ్ రిపోర్ట్‌లో తన భార్య పూర్తిగా క్యాన్సర్ నుంచి విముక్తురాలైనట్లు ఫలితం వచ్చిందని వివరించాడు.
ఆయుర్వేద ఆహార పద్ధతిని ప్రశంసిస్తూ సిద్ధూ చేసిన వీడియోను కొందరు తీవ్రంగా విమర్శించారు. అటువంటి ప్రకటనలు అశాస్త్రీయమైనవని, వైద్యపరంగా విశ్వసనీయత లేనివనీ ఆరోపించారు. శస్త్రచికిత్స, కీమోథెరపీ వంటి ఆధునిక వైద్య పద్ధతుల్లో చికిత్స చేయించినందువల్ల మాత్రమే ఆమెకు క్యాన్సర్ తగ్గిందనీ, అందులో ఆయుర్వేదానికి, దేశీయ ఆహార పద్ధతులకూ ఏమాత్రం సంబంధం లేదనీ పలువురు అల్లోపతీ వైద్యులు మండిపడ్డారు.
దానికి సిద్ధూ స్పందిస్తూ వివరణ ఇచ్చాడు. తన భార్యకు సమగ్రమైన వైద్యచికిత్స చేయించడంతో పాటు ఆయుర్వేద పద్ధతిలో డైట్‌ప్లాన్ అనుసరించామని చెప్పాడు. ఆమె త్వరగా కోలుకోడంలో ఆ రెండు పద్ధతులూ పని చేసాయన్నాడు. నవంబర్ 25న విడుదల చేసిన వీడియోలో, వైద్యులు మౌలిక చికిత్సను అందించారని చెబుతూ వైద్యులు, నిపుణుల సలహా మేరకే ఆయుర్వేద పద్ధతిలో డైట్ ప్లాన్‌ను అనుసరించామని చెప్పాడు. సిద్ధూ భార్య కూడా ఆహార ప్రణాళిక వల్లనే తను బరువు తగ్గానని, అది క్యాన్సర్ చికిత్సలో సాయపడిందనీ చెప్పుకొచ్చింది.
ఆ నేపథ్యంలో సిద్ధూ, అతని భార్య చేసిన వ్యాఖ్యల మీద శాస్త్రీయ అధ్యయనం చేయించాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. సిద్ధూ తన భార్య క్యాన్సర్ చికిత్సకు సంబంధించిన రికార్డులను, డైట్ ప్లాన్ వల్ల కోలుకున్నారనడానికి ఆధారాలనూ కూడా కోర్టుకు సమర్పించాలని పిటిషనర్ డిమాండ్ చేసారు.
అక్కడితో ఆగని పిటిషనర్, ఇటువంటి ధ్రువీకరణ లేని ప్రకటనలను సామాజిక మాధ్యమాల్లో చేయకుండా నియంత్రించడానికి మార్గదర్శకాలను రూపొందించాలని కేంద్ర సమాచార ప్రసార శాఖను ఆదేశించాలని కూడా డిమాండ్ చేసారు. సిద్ధూ ప్రకటన మీద ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్, ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద సంస్థలతో దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేసారు.
అయితే ఆ ప్రజాహిత వ్యాజ్యాన్ని హైకోర్టు తిరస్కరించింది. వైద్యచికిత్స విషయంలో వ్యక్తిగత అనుభవాలను నియంత్రించడం తమ పరిధిలోకి రాదని స్పష్టం చేసింది. సిద్ధూ అభిప్రాయాలతో పిటిషనర్ ఏకీభవించకపోతే వాటిని వినాల్సిన, అనుసరించాల్సిన అవసరం లేదని చెప్పింది. ‘‘ఆయన తన పద్ధతిని అనుసరించాలని మీకు చెప్పలేదు, తను ఏం చేసాడో అది మాత్రమే చెప్పాడు’’ అని గుర్తుచేసింది.
ఢిల్లీ హైకోర్టు సిద్ధూ వాక్ స్వాతంత్ర్యాన్ని సమర్ధించింది. భిన్నాభిప్రాయాలను చట్టపరమైన అణచివేత ద్వారా కాకుండా చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చునని గుర్తు చేసింది. ‘‘వాక్ స్వాతంత్ర్యాన్ని ఎదుర్కోవాలంటే అది వాక్ స్వాతంత్ర్యం ద్వారానే జరగాలి తప్ప ఒకరి వాక్ స్వాతంత్ర్యాన్ని అణచివేయడం ద్వారా కాదు. మన దేశంలో వాక్ స్వాతంత్ర్యం ఇంకా అమల్లోనే ఉంది’’ అని ద్విసభ్య ధర్మాసనం వ్యాఖ్యానించింది.
పిటిషనర్‌కు న్యాయస్థానం మరో సలహా ఇచ్చింది. ఏమాత్రం ఆరోగ్యకరం కాని సిగరెట్లు, మద్యం తయారీని వ్యతిరేకిస్తూ పిటిషన్ దాఖలు చేయవచ్చు కదా అని సూచించింది.
ఢిల్లీ హైకోర్టు తీర్పుతో పిటిషనర్ తన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.