IAF employee commits suicide after threats by a Muslim
friend
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో ఒక రాజస్థానీ హిందూ
యువకుడు ఆత్మహత్య చేసుకోవడం వెనుక, ఇస్లాంలోకి మతం మారాలన్న ఒత్తిడులే కారణమని
తెలుస్తోంది. తప్పుడు రేప్ కేసు పెట్టి, మతం మారకపోతే జైలుశిక్ష వేయిస్తామని
బెదిరించడంతో, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేస్తున్న యువకుడు ఆత్మహత్యకు
పాల్పడ్డాడు. ఈ నెల 20న జరిగిన ఈ ఘటన, దాని పూర్వాపరాలు ఆలస్యంగా వెలుగులోకి
వచ్చాయి.
సుఖారాం భీంచర్ (24) రాజస్థాన్‌లో కుచామన్ డీడ్వానా
జిల్లా మిదియాన్ అనే గ్రామానికి చెందిన యువకుడు. అతనికి 2017లో ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో
ఉద్యోగం వచ్చింది. ఈ నెల 19న అతనిపై పర్బత్సర్ పోలీస్ స్టేషన్లో రేప్ కేసు
నమోదయింది. కేసు రిజిస్టరైన మర్నాడే, అంటే ఫిబ్రవరి 20న సుఖారాం ఆత్మహత్య
చేసుకున్నాడు.
హైదరాబాద్‌లో చనిపోయిన సుఖారాం మృతదేహం మిదియాన్
గ్రామానికి ఈ నెల 23న చేరింది. అయితే, సుఖారాం తండ్రి ఆసారాం, తన కొడుకు మీద
తప్పుడు కేసు పెట్టారని ఆవేదన వ్యక్తం చేసారు. అత్యాచారం కేసు పెట్టిన యువతి
సుఖారాం స్నేహితుడి భార్యేనని, అతని తండ్రి హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నారనీ
ఆసారాం చెప్పారు. మామ-కోడలు కలిసి కుట్రపన్ని తన కొడుకు మీద తప్పుడు కేసు
పెట్టారని విలపించారు.
ఆసారాం చెప్పిన వివరాల ప్రకారం…. సుఖారాం
స్నేహితుడు సద్దాం హుసేన్. వారిద్దరూ చిన్నప్పటినుంచీ కలిసి చదువుకున్నారు.
ఇద్దరికీ పెళ్ళిళ్ళయ్యాయి. రెండు కుటుంబాల మధ్యా మంచి స్నేహం ఉండేది. అయితే ఆరేళ్ళ
క్రితం సుఖారాంకు భారతీయ వైమానిక దళంలో ఉద్యోగం వచ్చాక పరిస్థితి మారింది. 2020
తర్వాత, సుఖారాం సెలవులకు వచ్చిన ప్రతీసారీ సద్దాం హుసేన్ అతనికి ఏవేవో కబుర్లు
చెప్పి సుఖారాం నుంచి పెద్దమొత్తంలో డబ్బులు తీసుకుంటుండేవాడు.
సద్దాం హుసేన్ తండ్రి మొహమ్మద్ సయీద్ హెడ్
కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ఆ కుటుంబం దృష్టి సుఖారాం మీద పడింది. అతన్ని
ఇస్లాంలోకి మారాలంటూ వారు ఒత్తిడి చేయసాగారు. కానీ దానికి సుఖారాం ఒప్పుకోలేదు. ఆ
నేపథ్యంలో సద్దాం హుసేన్, అతని భార్య, అతని తండ్రి అయిన మొహమ్మద్ సయీద్ కలిసి
కుట్ర పన్నారు. సద్దాం భార్య ఈ నెల 19న సుఖారాం మీద రేప్ కేసు పెట్టింది. ఇస్లాంలోకి
మతం మారకపోతే జైలుశిక్ష పడేలా చేస్తామంటూ మొహమ్మద్ సయీద్, సద్దాం హుసేన్‌లు సుఖారాంను
బెదిరించారు.
చిన్నప్పటినుంచీ కలిసి చదువుకున్న స్నేహితుడే మతం
మారాలంటూ ఒత్తిడి తేవడం, స్నేహితుడి భార్యే తప్పుడు రేప్ కేసు పెట్టడం, మతం
మారకపోతే జైలుశిక్ష తప్పదంటూ మిత్రుడి తండ్రి బెదిరించడం… ఈ పరిణామాలన్నింటినీ
సుఖారాం తట్టుకోలేకపోయాడు. కేసు పెట్టిన మర్నాడే, అంటే ఈ నెల 20న హైదరాబాద్‌లోని
తన నివాసంలో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
సుఖారాం మృతదేహంతో అతని కుటుంబసభ్యులు గచ్ఛీపురా
పోలీస్‌స్టేషన్ దగ్గర ఆందోళన చేపట్టారు. తమ కొడుకును ఆత్మహత్య పురిగొల్పారంటూ
సద్దాం హుసేన్, అతని తండ్రి, భార్యల మీద ఫిర్యాదు చేసారు. కేసు దర్యాప్తు
చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన తర్వాతే శవాన్ని అంత్యక్రియలకు తీసుకువెళ్ళారు.