PFI’s Jaffar reveals plan to kill big wigs of RSS
2022 ఏప్రిల్ 16న కేరళలోని పాలక్కాడ్‌లో రాష్ట్రీయ
స్వయంసేవక్ సంఘ్ ప్రచారక్ ఎస్‌కె శ్రీనివాసన్‌ను దారుణంగా హింసించి చంపిన దుండగులకు
ఉగ్రవాద శిక్షణ తానే ఇచ్చానని జాఫర్ బీమంతవిడే అంగీకరించాడు. జాతీయ దర్యాప్తు
సంస్థ ఎన్ఐఏ విచారణలో అతను ఈ విషయాన్ని వెల్లడించాడు. ఎన్ఐఏ అతన్ని ఫిబ్రవరి 12న అరెస్ట్
చేసి అతన్ని విచారిస్తోంది.
ఇంటరాగేషన్‌లో జాఫర్ మరిన్ని భయంకరమైన విషయాలు
వెల్లడించాడు. సంఘ ప్రచారక్ శ్రీనివాసన్‌ను హత్య చేయడానికి స్కెచ్ వేసింది నిషిద్ధ
ఉగ్రవాద సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) అని తెలియజేసాడు. మరెంతోమంది
ఆర్ఎస్ఎస్ నాయకులను హత్య చేయడానికి పీఎఫ్ఐ ప్రణాళికలు రచించిందని వెల్లడించాడు.
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ నాయకులను తుదముట్టించడానికి పీఎఫ్ఐ ఒక హంతకముఠాను
సిద్ధం చేసిందని జాఫర్ స్పష్టంగా చెప్పాడు.
జాఫర్ పిఎఫ్ఐలో కీలక వ్యక్తి. అతను ఆయుధాల
వినియోగంలో శిక్షణ ఇచ్చేవాడు. ఆయుధ శిక్షణా కార్యక్రమాలు మలప్పురం దగ్గర 25ఎకరాల
విస్తీర్ణంలో విస్తరించిన గ్రీన్‌వ్యాలీ అనే ప్రాంతంలో నిర్వహించేవాడు. ఆ గ్రీన్‌వ్యాలీలో
ఉగ్రవాద శిక్షణా తరగతులు నిర్వహించేవారు. పలురకాల జంతువులపై దారుణమైన ప్రయోగాలు
చేసేవారని జాఫర్ వెల్లడించాడు.
పిఎఫ్ఐ వంటి ఉగ్రవాద సంస్థల కార్యకలాపాలను
కనుగొనడానికి ఎన్ఐఏ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు తీవ్రంగా చేసిన కృషి వల్లనే
జాఫర్ అరెస్ట్ సాధ్యమైంది. శ్రీనివాసన్ పాలక్కాడ్ జిల్లా శారీరక్ ప్రముఖ్‌గాను,
సంఘ ప్రచారక్‌గాను వ్యవహరించేవారు. ఆయన హత్య కుటుంబసభ్యులు, సంఘ్ పరివార్
బాధ్యులనే కాదు, అధికారులను సైతం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.
జాఫర్‌ను ఎన్ఐఏ అతని కన్నూర్ నివాసంలో అరెస్ట్ చేసింది.
అతను దేశవ్యతిరేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాడని ఎన్ఐఏ గతంలోనే ఆరోపించింది.
భారతదేశాన్ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చేయాలనే లక్ష్యంతో పిఎఫ్ఐ చేపట్టిన
కార్యకలాపాలకు సంబంధించిన కేసులో జాఫర్ 59వ అనుమానితుడు. 2010 జూన్ 4న ప్రొఫెసర్ టిజె
జోసెఫ్ చేయి నరికివేసిన నరహంతక ముఠాలోనూ జాఫర్ ప్రధాన పాత్రధారి. కేరళ
రాష్ట్రవ్యాప్తంగా పిఎఫ్ఐ హంతక ముఠాలకు సరైన శిక్షణ ఇవ్వడం అతని ప్రధాన వృత్తి.
ఆందోళన కలిగించే అంశం ఏంటంటే, గ్రీన్‌వ్యాలీ
వంటిచోట్ల తామిస్తున్న కఠోర శిక్షణకు కేరళ పోలీసుల సహకారం ఉందని జాఫర్
వెల్లడించాడు. నిజానికి ఎన్ఐఏ అలాంటి సెంటర్ల మీద నిఘా పెంచాలని, సోదాలు తరచుగా
చేయాలనీ కేరళ పోలీసులను కోరింది. అయితే ఇప్పుడు కేరళ పోలీసులు అలాంటి నిఘాయే
పెట్టలేదు, సోదాలూ చేయలేదు.