He wrote
to Gandhi, Congress Worse Than The British
(నేడు దేశభక్త కొండా
వెంకటప్పయ్య జయంతి)
‘‘మనం మనస్ఫూర్తిగా కోరుకున్న
స్వరాజ్యం అనే ఒకేఒక లక్ష్యం ప్రజలను మీ వెంట నడిపించింది. ఇప్పుడు ఆ గమ్యం
చేరుకోగానే ఈ స్వాతంత్ర్య యోధుల్లో నీతినియమాలు అంతరించిపోయాయి. రోజురోజుకూ పరిస్థితి
దిగజారిపోతున్నది. ప్రజలు కాంగ్రెస్‌ను దూషిస్తున్నారు. బ్రిటిష్ రాజ్యమే
మేలంటున్నారు. ఇప్పుడు స్వతంత్ర దేశంలో కాంగ్రెస్ అవినీతికి ఆలవాలమైపోతున్నది.
కాంగ్రెసు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తరచూ జోక్యం చేసుకోవడం వలన జిల్లా కలెక్టరులూ,
రెవెన్యూ అధికారులూ తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోతున్నారు. ఈ పైరవీకారుల
ప్రభావంతో, భయంతో నిజాయితీ గలవారు తమ పదవులలో ఉండే పరిస్థితి లేదు.’’
1947 డిసెంబర్లో, ప్రపంచ
చరిత్రలోనే ఒక మహోన్నత చారిత్రక ఘట్టంగా చరెప్పే స్వేచ్ఛాభారతి ఆవిర్భావం తర్వాత
మూడు మాసాలకే గాంధీజీకి అందిన ఒక లేఖలోని వ్యధాభరిత వాక్యాలివి. గాంధీకి ఇలాంటి
లేఖ ఒకటి అందిందని ‘మార్చ్’ అనే పత్రిక పెద్దపెద్ద అక్షరాలతో వార్తాకథనం కూడా ప్రచురించింది.
ఆ వార్తకు శీర్షిక “Congress
Worse Than The British”. కాంగ్రెస్ పతనావస్థ గురించి అలా లేఖ రాసినవారు శ్రీ కొండా
వెంకటప్పయ్య పంతులు.
కొండా వెంకటప్పయ్య 1866 ఫిబ్రవరి
22న పాతగుంటూరులో పుట్టారు. తల్లి బుచ్చమ్మ, తండ్రి కోటయ్య. వారి ప్రాథమిక విద్య
గుంటూరులోనే సాగింది. తర్వాత బీఏ బీఎల్ మద్రాసులో చేసారు. చదువు పూర్తయ్యాక
బందరులో న్యాయవాద వృత్తిని చేపట్టారు. బాల్యం నుంచే దేశభక్తి, ప్రజాసేవా తత్పరత
కలిగిన వెంకటప్పయ్య ఇరవయ్యో శతాబ్ది ఆరంభంలో జాతిని చైతన్యవంతం చేయడానికి ‘‘కృష్ణా
పత్రిక’’ ప్రచురణను ప్రారంభించారు. 1905 వరకూ ఆయనే ఆ పత్రికను నడిపారు. కృష్ణాజిల్లా
నుండి గుంటూరుజిల్లాను వేరు చేసిన తరువాత ఆ జిల్లాకు వేరే న్యాయస్థానం రావడంతో,
వెంకటప్పయ్య తన స్వస్థలం గుంటూరుకు వచ్చేసారు. తాను గుంటూరులో స్థిరపడిన తరువాత
కృష్ణాపత్రిక సంపాదకత్వ బాధ్యతలను శ్రీ ముట్నూరి కృష్ణారావుకు అప్పగించారు.
న్యాయవాద వృత్తిలో వెంకటప్పయ్య
కేవలం ధనార్జనే ప్రధానంగా పెట్టుకోలేదు. దానధర్మాల కోసం సొంత ఆస్తినే అమ్ముకోవలసి
వచ్చింది. ఉన్నవ దంపతులు స్థాపించిన శారదానికేతన్కి వెంకటప్పయ్య తన ఆస్తి నుంచి
కొంతభాగం అమ్మి పదివేల రూపాయల విరాళం ప్రకటించారు. 1910లో బందరు జాతీయ కళాశాల శ్రీ
వెంకటప్పయ్య చేతులమీదుగా ప్రారంభమైంది. స్వామీ సీతారాం కావూరులో స్థాపించిన
వినయాశ్రమానికి భారీగా విరాళం ఇచ్చారు. ఇలాంటి దానాలు ఇంకా ఎన్నో చేసారు.
1912 మే నెలలో కృష్ణా, గుంటూరు
జిల్లాల రాజకీయ మహాసభ నిడదవోలులో జరిగింది. అప్పటికి పశ్చిమ గోదావరి జిల్లా లేదు.
కొవ్వూరు నుంచి బెజవాడ వరకూ కృష్ణా జిల్లాయే అన్నమాట. ఆ సభలోనే కొండా వెంకటప్పయ్య
సలహాపై ఉన్నవ లక్ష్మీనారాయణ మొదలగు గుంటూరు యువకులు పదకొండు తెలుగు జిల్లాలతో
ప్రత్యేక ఆంధ్రరాష్ట్రం ఏర్పాటు చేయాలనే విషయంలో మంతనాలు జరిపారు. 1913లో గుంటూరు
జిల్లా రాజకీయ మహాసభ బాపట్లలో జరిగింది. అదే ప్రదేశంలో కొండా వెంకటప్పయ్య సలహా
మేరకు మొదటి ఆంధ్ర మహాసభ బిఎన్ శర్మ అధ్యక్షతన జరిగింది. ఈ విషయమై దేశవ్యాప్త
ప్రచారం కోసం ఏర్పడిన కార్యనిర్వాహక కమిటీలో కొండా వెంకటప్పయ్యదే ప్రధాన పాత్ర.
నెల్లూరులో జరిగిన ఆంధ్రమహాసభకు ఆయనే అధ్యక్షుడిగా ఎన్నికై ఆంధ్రరాష్ట్ర
నిర్మాణానికి ఒక నిర్దిష్ట కార్యక్రమం రూపొందించారు. 1917లో మాంటేగ్-ఛెమ్స్‌ఫర్డ్
ప్రతినిధి వర్గాన్ని ప్రభుత్వం నియమించింది. ఈ ప్రతినిధివర్గం మద్రాసుకు
వచ్చినప్పుడు భాషా ప్రాతిపదికన రాష్ట్రాల విభజన అవసరాన్ని ఉగ్గడించిన ఆంధ్ర
ప్రతినిధులలో కొండా వెంకటప్పయ్య ముఖ్యులు.
1918లో ప్రత్యేక ఆంధ్రరాష్ట్ర
కాంగ్రెసు కమిటీ ఏర్పడింది. రాష్ట్ర సాధనా ప్రక్రియలో ఇది తొలి విజయమని చెప్పాలి.
ఆంధ్రరాష్ట్ర కాంగ్రెసు కమిటీకి తొలి కార్యదర్శి శ్రీ వెంకటప్పయ్యే. ఆ రోజుల్లో కృష్ణా,
గుంటూరు, గోదావరి జిల్లాలు కలసి ఒకే నియోజకవర్గంగా ఉండేది. ఓటర్లు అంతా కలిపితే
500 మంది మాత్రమే. ఈ నియోజకవర్గం నుంచి పోటీచేసి కొండా వెంకటప్పయ్య మద్రాసు
కౌన్సిలుకు ఎన్నికయ్యారు. సహాయ నిరాకరణోద్యమం కొనసాగించడానికి వీలుగా కాంగ్రెసు
పార్టీ తన సభ్యుల రాజీనామా కోరగానే రెండవ ఆలోచన లేకుండా తన శాసనసభ సభ్యత్వానికి
రాజీనామా చేసిన నిస్వార్థ నాయకుడు శ్రీ కొండా వెంకటప్పయ్య.
1921 మార్చి 31, ఏప్రిల్ 1 తేదీలలో
అఖిల భారత కాంగ్రెస్ మహాసభలు బెజవాడలో జరిగాయి. మహాత్ముని ఆంధ్ర పర్యటన
వెంకటప్పయ్య ఆధ్వర్యంలోనే జరిగింది. వేలాది రూపాయలు విరాళాలుగా స్వీకరించి
స్వరాజ్య నిధికి సమర్పించారు శ్రీ వెంకటప్పయ్య. పెదనందిపాడు పన్నుల
నిరాకరణోద్యమంలో పాల్గొన్నందుకుగానూ ఆయన మొదటిసారి జైలుశిక్ష అనుభవించారు.
1923లో కాకినాడలో జరిగిన అఖిల భారత
కాంగ్రెస్ మహాసభలు చారిత్రాత్మకమైనవి. సహాయ నిరాకరణ, శాసనోల్లంఘనల అనంతరం శాసనసభా
ప్రవేశవాదులకు, బహిష్కరణవాదులకు మధ్య తీవ్ర చర్చలు జరుగుతున్న రోజులవి. కాంగ్రెస్
అధ్యక్షుడిగా ఎన్నికైన దేశబంధు చిత్తరంజన్‌దాస్ ఈ విభేదాల మధ్య తన పదవికి రాజీనామా
చేసారు. మధ్యేమార్గంగా వెంకటప్పయ్యని అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షుడిగా
ఎన్నుకున్నారు. ఆంధ్రరత్న శ్రీ దుగ్గిరాల గోపాలకృష్ణయ్య అఖిల భారత కాంగ్రెస్
కార్యదర్శి అయ్యారు. స్వల్పకాలమే అయినా అఖిల భారత కాంగ్రెస్ కార్యాలయాన్ని
బెజవాడకు తరలించారు. 1933లో గాంధీజీ ఆంధ్రలో హరిజన యాత్ర సాగించారు. అనేక
గ్రామాలలో హరిజనుల చేత దేవాలయ ప్రవేశం చేయించారు. ఆంధ్రదేశంలో 65వేల రూపాయలు హరిజన
నిధి వసూలైంది.
1929లో సైమన్ కమిషన్ రాక సందర్భంలోనూ,
1930లో ఉప్పు సత్యాగ్రహంలోనూ, 19412లో క్విట్ ఇండియా ఉద్యమంలోనూ పాల్గొన్నందుకు
కొండా వెంకటప్పయ్యకు జైలు శిక్షలు విధించారు. 1937లో జరిగిన ఎన్నికల్లో ఆయన
మద్రాసు శాసనసభకు ఎన్నికయ్యారు. ఆంధ్రరాష్ట్ర ఉద్యమం ఆరంభకుడిగా 1920 నుంచి 1949లో
తాను కీర్తిశేషుడయ్యేవరకూ ఆంధ్రదేశమే తానుగా వ్యవహరించి ఆంధ్రుల అభిమానానికి పాత్రుడైన
మహానాయకుడు దేశభక్త కొండా వెంకటప్పయ్య. ఆంధ్ర రాజకీయాలలో ఆయన స్థానం దేశ
రాజకీయాలలో మదనమోహన మాలవ్యా స్థానం వంటిది.
మానవతావాదిగా, దేశభక్తుడుగా
జీవితాంతం కృషి చేసిన నిరాడంబరమూర్తి శ్రీ కొండా వెంకటప్పయ్య ప్రాణం 1949 ఆగస్టు
15న అనంత స్వేచ్ఛావాయువుల్లో కలసిపోయింది.