ఎస్జీటీ
పోస్టుకు బీఎడ్ అభ్యర్థులను అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన
నోటిఫికేషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. అద్దంకికి చెందిన బొల్లా సురేష్ తో
మరికొందరు దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు విచారించింది.
సుప్రీంకోర్టు నిబంధనలకు
విరుద్ధంగా ఎస్జీటీ పోస్టులకు బీఎడ్ అభ్యర్థులను అనుమతించారని పిటిషనర్ తరఫు
న్యాయవాదులు ప్రస్తావించారు. రాష్ట్రప్రభుత్వ తీరుతో డీఎడ్ అభ్యర్థులు తీవ్రంగా
నష్టపోతారని కోర్టుకు తెలిపారు.
ఎస్జీటీ
అభ్యర్థులు తక్కువగా ఉన్నందునే బీఎడ్ అభ్యర్థులను అనుమతించాల్సి వచ్చిందని
ప్రభుత్వం తరఫు అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ కోర్టుకు తెలిపారు.
అర్హత
సాధించిన బీఎడ్ అభ్యర్థులు, రెండేళ్ళ బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన తర్వాత, బోధనకు
అనుమతిస్తామన్నారు. సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా నోటిషికేషన్ ఇవ్వడంపై నిలదీసిన
న్యాయస్థానం, బ్రిడ్జి కోర్సు చట్టబద్ధతను ప్రశ్నించింది.
ఈ పిటిషన్ పై తుది ఉత్తర్వులు
జారీ చేసేందుకు ధర్మాసనం సిద్ధపడగా, ఒక్క రోజు సమయం కావాలని ఏజీ కోరారు. అడ్వకేట్
జనరల్ వినతి మేరకు విచారణను బుధవారానికి న్యాయస్థానం వాయిదా వేసింది.