హమాస్ తీవ్రవాదులను పూర్తిగా తుడిచివేసేందుకు ఇజ్రాయెల్ సైన్యం భీకరదాడులు (hamas israel war) కొనసాగిస్తోంది. సోమవారం ఒక్క రోజే 107 మంది చనిపోయారు. గత ఏడాది అక్టోబరు 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై మెరుపుదాడికి దిగినప్పటి నుంచి నేటి వరకు జరిగిన పోరులో మొత్తం 29092 మంది చనిపోయారు. 69 వేల మందికిపైగా గాయపడ్డారు. పది వేల మంది హమాస్ ఉగ్రవాదులను హతమార్చామని ఇజ్రాయెల్ ప్రకటించింది. 236 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారని ఐడీఎఫ్ తెలిపింది.
మరోవైపు ఎర్రసముద్రంలో హౌతీలు రెచ్చిపోతున్నారు. తాజాగా సరకు రవాణా నౌకపై దాడికి దిగడంతో అందులోని సిబ్బంది పరారయ్యారు. బాబ్ ఎల్ మండేప్ ప్రాంతంలో సరకు రవాణా నౌకపై దాడి చేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. గల్ఫ్ ఆఫ్ ఎడెన్‌లోనూ మరో నౌకపై హౌతీలు దాడిచేశారు.హౌతీ దాడులను అమెరికా తీవ్రంగా ఖండించింది. ప్రతిదాడులుంటాయని హెచ్చరించింది.