Sonia Gandhi files nomination for Rajya Sabha from Rajasthan
కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షురాలు
సోనియా గాంధీ రాబోయే రాజ్యసభ ఎన్నికల కోసం నామినేషన్ దాఖలు చేసారు. రాజస్థాన్
రాజధాని జైపూర్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో సోనియాగాంధీకి తోడుగా కుమారుడు రాహుల్
గాంధీ, కుమార్తె ప్రియాంకా గాంధీ పాల్గొన్నారు.
కాంగ్రెస్ పార్టీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో
ఒక సీటు గెలుచుకోవడం ఖాయమని భావిస్తోంది. సోనియాగాంధీ రాజ్యసభ బరిలో నిలవడం ఇదే
మొదటిసారి. 77ఏళ్ళ సోనియా ఐదు పర్యాయాలు లోక్‌సభ ఎంపీగా విజయాలు సాధించారు.
ప్రస్తుతం ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ లోక్‌సభ
నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సోనియాగాంధీ, రాబోయే లోక్‌సభ సార్వత్రిక
ఎన్నికల్లో పోటీ చేయడం లేదు.
సోనియా మొదటగా 1999లో ఎంపీ అయ్యారు. ఆ తర్వాత
కాంగ్రెస్ అధ్యక్షురాలి పదవిని చేపట్టారు.
రాజ్యసభలో అన్నిరాష్ట్రాల సభ్యుల్లో నుంచి 56మంది
సభ్యులు వచ్చే ఏప్రియల్ నెలలో రిటైర్ అవుతున్నారు. ఆ స్థానాలకు ఎన్నిక ఫిబ్రవరి
27న జరగనుంది. నామినేషన్లు దాఖలు చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ.
రాజస్థాన్‌నుంచి మూడు రాజ్యసభ స్థానాలకు ఎన్నికలు
జరగనున్నాయి. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రాజ్యసభలో తన ఆరేళ్ళ పదవీకాలాన్ని
ముగించుకున్నారు. ఆ స్థానంలోకి సోనియాగాంధీ వస్తారు.
గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచి రాజ్యసభలోకి ప్రవేశిస్తున్న
రెండో వ్యక్తి సోనియాగాంధీ. అంతకుముందు 1964 ఆగస్టు నుంచి 1967 ఫిబ్రవరి వరకూ ఇందిరా గాంధీ రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్నారు.