అండర్ 19 ప్రపంచ కప్ క్రికెట్‌లోనూ భారత్‌కు ఓటమి తప్పలేదు. కుర్రాళ్లు కంగారు పడ్డారు. డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 79 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా చేతిలో ఓడింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 253 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా జట్టులో హర్జాస్ సింగ్ 55 పరుగులు, కెప్టెన్ హ్యూ వీబ్జెన్ 48, ఒలీవర్ పీక్ 46 నాటౌట్‌గా నిలిచారు.254 పరుగుల విజయలక్ష్యంతో బరిలో దిగిన భారత జట్టు 43.5 ఓవర్లలో 174 పరుగులు చేసి, ఆలౌటైంది.
లక్ష్య ఛేదనలో భారత యువ ఆటగాళ్లు నిలవలేకపోయారు. టీమ్‌ఇండియా జట్టులో (under 10 cricket world cup) హైదరాబాద్ కుర్రాడు ఆదర్శ్ సింగ్ 47, మురుగన్ అభిషేక్ 42 పరుగులు చేశారు. మిగిలిన ఆటగాళ్లు ఎవరూ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేక చేతులెత్తేశారు. ఆసీస్ బౌలర్ బియర్డ్ మన్‌ను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్‌గా ప్రకటించారు. బియర్డ్ మన్ 3, మెక్ మిలన్ 3 వికెట్ల చొప్పున తీశారు.
లక్ష్య ఛేదనలో భారత జట్టు ఏ దశలోనూ ప్రభావం చూపలేదు. వరుసగా వికెట్లు కోల్పోవడంతో ఒక దశలో 130 పరుగులకే ఆలౌటవుతారని అందరూ భావించారు. ఆదర్శ్ సింగ్, మురుగన్ అభిషేక్ నిలబడటంతో ఆ మాత్రం పరుగులైనా చేసి జట్టు పరువు కాపాడారు.