పార్లమెంటు
ఎన్నికల సమయం దగ్గర పడటంతో తమిళనాడు బీజేపీలోకి వలసలు పెరుగుతున్నాయి. పాలక,
ప్రతిపక్ష పార్టీలను కాదంటూ బీజేపీలో చేరికకు ఆసక్తి చూపుతున్నారు. 15 మంది మాజీ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎంపీ నేడు
భారతీయ జనతా పార్టీలో చేరారు. వీరంతా అన్నా డీఎంకే నుంచి చట్ట సభలకు గతంలో
ప్రాతినిధ్యం వహించారు.
దిల్లీ లోని బీజేపీ జాతీయ కార్యాలయంలో ఆ పార్టీ అగ్ర నేతల
సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్నారు. కేంద్రమంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, ఎల్ మురుగన్
ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పెద్ద
సంఖ్యలో మాజీ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడం ద్వారా అనుభవజ్ఞుల నాయకత్వం తమకు దొరికిందన్న
అన్నామలై, కేంద్రంలో బీజేపీ హ్యాట్రిక్ కొట్టడం ఖాయమన్నారు. దక్షిణాదిన ప్రధాని
మోదీకి మంచి ఆదరణ లభిస్తుందన్నారు.
రాబోయే
సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ 370 సీట్లు వస్తాయని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్
అన్నారు. తమిళనాడులో కూడా ఎంపీ సీట్లు గెలుస్తామన్నారు.
తమిళ
రాజకీయాల్లో ప్రముఖులుగా పేరున్న కే వడివేల్, ఎంవీ రత్నం, ఆర్ చిన్నస్వామి, పీఎస్
కందస్వామి బీజేపీ ప్రాథమిక సభ్యత్వం తీసుకున్నారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు
అన్నామలై నేతృత్వంలో చేరికలు జరిగాయి.
2024
లోక్ సభ ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ కోసం ప్రయత్తిస్తున్న బీజేపీ నేతృత్వంలోని
ఎన్డీయే కూటమికి ఊతమిచ్చే పెద్ద రాజకీయ పరిణామం దక్షిణాదిన తొలిసారి చోటుచేసుకుంది.
ఉత్తరాదితో పోల్చినప్పుడు దక్షిణాదిలో బీజేపీ అంత ప్రభావశీలంగా లేదు. దీంతో ఆ
పార్టీ దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం కావడానికి ప్రత్యేక దృష్టిసారించింది.
ప్రాంతీయ పార్టీలకు దీటుగా పార్టీ విస్తరణ కార్యక్రమంలో కమలనాథులు తీవ్రంగా
శ్రమిస్తున్నారు.
తమిళనాడులో
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అన్నామలై బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ముఖ్యమంత్రి
స్టాలిన్ ను ముప్పతిప్పలు పెడుతున్నారు. స్టాలిన్ ప్రభుత్వం అనుసరిస్తున్న సనాతన
వ్యతిరేక ధోరణిని ఎండగడుతున్నారు.
కేంద్రప్రభుత్వం
అమలు చేస్తోన్న పథకాలను, ఎన్డీయే అభివృద్ధి నమూనాను, బీజేపీ రాజకీయ లక్ష్యాలను
ప్రజల్లోకి తీసుకెళ్ళారు. తద్వారా యువతను బీజేపీ వైపు ఆకర్షిస్తున్నారు.