Delhi Court Summons Arvind Kejriwal
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ
కోర్టు సమన్లు జారీ చేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లకు ఎందుకు
స్పందించలేదో వివరించడానికి ఫిబ్రవరి 17న న్యాయస్థానానికి హాజరవ్వాలంటూ
ఆదేశించింది.
లిక్కర్ ఎక్సైజ్ పాలసీలో మనీ లాండరింగ్‌కు
పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కోసం కేజ్రీవాల్‌కు ఈడీ ఇప్పటికి 5సార్లు సమన్లు
జారీ చేసింది. కేజ్రీవాల్ ఒక్కసారైనా ఈడీ ముందు హాజరవలేదు. దాంతో ఈడీ
న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఫలితంగా కోర్టు ఇవాళ కేజ్రీవాల్‌కు సమన్లు
పంపించింది. కోర్టు ఉత్తర్వులను అధ్యయనం చేస్తున్నామనీ, కోర్టు ముందు హాజరయ్యే
విషయంలో చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామనీ ఆమ్ ఆద్మీ వెల్లడించింది.
మద్యం ఎక్సైజ్ విధానంలో ఆర్థికపరమైన అవకతవకలకు
పాల్పడ్డారంటూ మనీ లాండరింగ్ కేసు కింద, ఢిల్లీలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ
పెద్దలపై సీబీఐ విచారణ చేస్తోంది. అందులో భాగంగా గతేడాది ఏప్రిల్‌లో కేజ్రీవాల్‌ను
సీబీఐ తొమ్మిది గంటల పాటు ప్రశ్నించింది. ఆ కేసులో ఆయన నిందితుడు కాదు. కానీ ఇద్దరు
ఆప్ నాయకులు అరెస్ట్ అయ్యారు. కేజ్రీవాల్ కుడిభుజం, ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్
సిసోడియా గతేడాది ఫిబ్రవరిలోనూ, రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ గతేడాది అక్టోబర్‌లోనూ
అరెస్ట్ అయ్యారు.
ఈడీ తొలుత గతేడాది నవంబర్ 2న, డిసెంబర్ 21న, ఈ
యేడాది జనవరి 19న, జనవరి 31న, ఫిబ్రవరి 2న… మొత్తం ఐదుసార్లు కేజ్రీవాల్‌కు
సమన్లు జారీ చేసింది. ఒక్కోసారి ఒక్కో వంక చెబుతూ కేజ్రీవాల్ ఏ ఒక్కసారీ ఈడీ ముందు
హాజరు కాలేదు.
ఈడీ సమన్లు రాజకీయ ప్రేరేపితాలు అనీ, కేజ్రీవాల్‌ను
అరెస్ట్ చేసి ఢిల్లీ ప్రభుత్వాన్ని కూలదోయడమే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏకైక లక్ష్యమనీ
ఆమ్ ఆద్మీ పార్టీ ఆరోపిస్తోంది. తమ నాయకులపై చేస్తున్న ఆరోపణలన్నీ అబద్ధాలని
మండిపడుతోంది.