Three day long TTD Dharmika Sadassu concluded
తిరుమలలో మూడురోజుల పాటు నిర్వహించిన ధార్మిక
సదస్సు సోమవారం ముగిసింది. ఆ సందర్భంగా టీటీడీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి సదస్సు
తీర్మానాలను మీడియాకు వెల్లడించారు.
అన్య మతస్తులు స్వచ్ఛందంగా హిందూ మతంలోకి మారడానికి
శ్రద్ధతో ఇష్టపడి వచ్చేవారి కోసం తిరుమలలో ఒక ప్రాంగణం ఏర్పాటుచేసి పవిత్రజల
ప్రోక్షణంతో విధిపూర్వకంగా ప్రక్రియను నిర్వహించి స్వాగతించాలని, ఒకసారి శ్రీవారి దర్శనం కల్పించాలని సదస్సు
తీర్మానించింది.
సదస్సులో చర్చించి నిర్ణయించిన మిగతా తీర్మానాలు
ఇలా ఉన్నాయి…
కులవివక్ష వల్ల గ్రామీణ ప్రాంతాల్లో జరుగుతున్న మత
మార్పిడులను నిరోధించేందుకు తగిన చర్యలు తీసుకోవాలి.హిందూ యువత
తమ చుట్టూ ఉన్న వాతావరణం, ప్రలోభాల కారణంగా మతం మారుతున్నారు. ఈ
పరిస్థితిని అడ్డుకోడానికి అనేక శిక్షణా శిబిరాలు నిర్వహించాలి. మతమార్పిడులు
నివారించేందుకు హరిజనవాడలు, గిరిజనవాడల్లో హిందూమత కార్యక్రమాలను విస్తృతంగా
చేపట్టాలి. వీలైనన్ని ఎక్కువ మందికి వారి మతాన్ని రక్షించుకోవడానికి, ప్రతి
వ్యక్తిలో ఆధ్యాత్మికతను పెంపొందించడానికి బోధించడం అవసరం.
హిందూ సమాజంలో ఆత్మవిశ్వాసం పెంపొందించేందుకు విస్తృతంగా
శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రస్తుతం ఉన్న వివిధ పాఠశాలల పాఠ్యాంశాల్లో
హిందూ ధర్మ ప్రాధాన్యతను నొక్కి చెప్పాలి.
హిందూ మత విషయాలు ఎక్కువగా తెలుగు, సంస్కృతంలో
ఉన్నాయి. ఈ రెండు భాషలనూ బాలబాలికలకు, యువతీ యువకులకు నేర్పించాలి.
ఇతిహాసాలు, పురాణాల సారాంశాన్ని అన్ని వర్గాల ప్రజలకూ సులభంగా
అర్థమయ్యేలా ప్రచారం చేయడానికి ధర్మ ప్రచారకులకు శిక్షణ ఇవ్వాలి.
హరిజన, గిరిజన, మత్స్యకార
ప్రాంతాల్లో శిథిలావస్థలో ఉన్న దేవాలయాల పునరుద్ధరణ, మందిరాల
నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలి. శ్రీవాణి ట్రస్ట్ ఆధ్వర్యంలో వెనుకబడిన
ప్రాంతాల్లో టిటిడి ఇప్పటికే వేలాది దేవాలయాలను నిర్మించింది, ఈ కార్యక్రమాన్ని ఇకపైనా
కొనసాగిస్తుంది.
యాత్రికులు తిరుమలతో సమానంగా తిరుపతిలో
ఆధ్యాత్మిక వాతావరణాన్ని అనుభవించగలిగేలా తిరుపతిని మార్చాలి. గో సంరక్షణ
కార్యకలాపాలను విస్తృతం చేయాలి. వేద ధర్మాన్నీ, వేద శాస్త్రాలనూ పరిరక్షించాలి. ద్రవిడ
వేదాన్ని కూడా గుర్తించి ప్రోత్సహించాలి. సనాతన ధర్మ సూత్రాలను సోషల్ మీడియా ద్వారా
విస్తృతంగా ప్రచారం చేయాలి.
ప్రతీ ఏటా ఒకసారి తిరుమల లేదా తిరుపతిలో ఇటువంటి
సదస్సులు నిర్వహించాలి. గ్రామ, జిల్లా స్థాయిలలో కూడా నిర్వహించాలి. ఈ
సదస్సు తీర్మానాలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని హిందూ మత, ధార్మిక
సంస్థలు కూడా అమలు చేయాలి.