Islamic preacher arrested for hate speech, taken to Gujarat
విద్వేష ప్రసంగం చేసిన ఒక ముస్లిం బోధకుణ్ణి గుజరాత్
పోలీసులు ముంబైలో అరెస్ట్ చేసారు. ముఫ్తీ సల్మాన్ అజారీ అనే ఆ వ్యక్తిని గతరాత్రి
ముంబై ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ నుంచి జునాగఢ్ తీసుకెళ్ళారు.
మౌలానా ముఫ్తీ సల్మాన్ అజారీ జనవరి 31న గుజరాత్‌లోని
జునాగఢ్‌లో ఒక ప్రసంగం చేసాడు. ఆ వీడియో సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా
ప్రచారమైంది. అందులో అతను వాడిన భాష, పదజాలం విద్వేషాన్ని వెళ్ళగక్కుతున్నాయన్న
ఆరోపణలపై అతన్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ యాంటీ టెర్రరిజమ్
స్క్వాడ్ పోలీసులు ఈ ఉదయం అతన్ని తమ కస్టడీలోకి తీసుకుని రెండు రోజుల ట్రాన్సిట్
రిమాండ్ మీద జునాగఢ్ తీసుకువెళ్ళారు.
మౌలానా ముఫ్తీ సల్మాన్ అజార్ అనుచరులు ఈ విషయం
తెలుసుకుని ఈ ఉదయం ఘట్కోపర్ పోలీస్ స్టేషన్ ముందు గుమిగూడారు. మౌలానాను బైటకు
తీసుకువెడుతున్న సమయంలో ట్రాఫిక్ జామ్ చేసారు. దాంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి
గుంపును చెదరగొట్టి, కాన్వాయ్‌కు దారి చేసారు. ఆ కాన్వాయ్ మౌలానాను జునాగఢ్ తీసుకెళ్ళింది.
మౌలానా అజారీ ఇస్లాంలో
సున్నీ తెగకు చెందినవాడు, ముంబైకి చెందిన అతను తనను తాను మోటివేషనల్ స్పీకర్‌గా
చెప్పుకుంటూ ఉంటాడు. అతను జమియా రియాజ్ ఉల్ జన్నా, అల్ అమాన్ ఎడ్యుకేషన్ అండ్
వెల్ఫేర్ ట్రస్ట్, దారుల్ అమాన్ అనే సంస్థల స్థాపకుడు. అతను ఈజిప్ట్ రాజధాని
కైరోలోని ఇస్లామిక్ విద్యా కేందారం అల్ అజర్ యూనివర్సిటీలో చదువుకున్నాడు.
ప్రసంగాలు ఇవ్వడంలో దిట్ట అయిన మౌలానా అజారీకి ప్రపంచవ్యాప్తంగా అనుయాయులు
పెద్దసంఖ్యలో ఉన్నారు.