కాంగ్రెస్
లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ మరోసారి విమర్శలు గుప్పించారు. భారత్ లోని పవిత్ర
స్థలాల ప్రాముఖ్యతను గుర్తించడంలో విఫలమైందని దుయ్యబట్టారు. నేడు, అస్సాంలో
పర్యటించిన ప్రధాని మోదీ, పలు అభివృద్ధి పనులు ప్రారంభించారు. రూ.11,600 కోట్ల విలువైన
పనులను ప్రారంభించామని, ఇవి దక్షిణ
ఆసియాతో ఈశాన్య ప్రాంత అనుసంధానాన్ని మెరుగు పరుస్తాయని ఆకాంక్షించారు.
దేశానికి
స్వాతంత్ర్యం లభించిన తర్వాత ఎక్కువ కాలం అధికారంలో ఉన్నపార్టీ మన సంస్కృతి,
సంప్రదాయాల ప్రాముఖ్యాన్ని విస్మరించిందన్న మోదీ, వాటిని పాటించడం అవమానం అనే భావన
కల్గించదన్నారు. దేశంలోని పవిత్ర స్థలాల అభివృద్ధిని విస్మరించి, రాజకీయ లబ్ధి
కోసం గత చరిత్రను మరుగున పడేసిందని విమర్శించారు.
గత జ్ఞాపకాలను
మరిచిపోయిన ఏ దేశం కూడా అభివృద్ధి సాధించలేదన్న మోదీ, పవిత్ర స్థలాలను గత నాగరికత
చిహ్నాలుగా అభివర్ణించారు. సంక్షోభాలను ఎదుర్కొని
జాతి ఎలా నిలబడిందో చెప్పే గుర్తులుగా చూడాలని సూచించారు. గడిచిన పదేళ్ళలో మాత్రం ఈ ఆలోచనలో ఎంతో మార్పు వచ్చిందన్నారు.