ఇజ్రాయెల్ హమాస్ పోరులో ఇప్పటి వరకు 220 మంది సైనికులు మృతి చెందినట్లు ఐడీఎఫ్ అధికారులు ప్రకటించారు. తాజాగా శనివారంనాడు హమాస్ జరిపిన దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన 24 సంవత్సరాల యువ సైనికుడు ప్రాణాలు కోల్పోయాడని ఐడీఎఫ్ వెల్లడించింది. హమాస్ ఉగ్రవాదులకు, హెజ్బొల్లా ఉగ్రవాదులు కూడా తోడు కావడంతో ఇజ్రాయెల్ సైన్యం లెబనాన్ భూభాగంలో కూడా దాడులు చేయాల్సి వస్తోందని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. లెబనాన్ నుంచి హెజ్బోల్లా తీవ్రవాదులు ఇజ్రాయెల్‌పై రాకెట్ దాడులు చేస్తున్నారని ఐడీఎఫ్ తెలిపింది.
అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్ పౌరులపై ఊచకోతకు దిగాక మొదలైన యుద్ధంలో ఇప్పటి వరకు 27019 మంది ప్రజలు చనిపోయారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.66139 మంది గాయాల పాలయ్యారు. ఇజ్రాయెల్ సరిహద్దులో లెబనాన్ నుంచి హెజ్బోల్లా దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. హమాస్ ఉగ్ర దాడుల్లో ఇప్పటి వరకు 1139 మంది ఇజ్రాయెల్ పౌరులు ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా తెలిపింది.