విశాఖలో దారుణం చోటుచేసుకుంది. విశాఖలోని మధురవాడ కొమ్మాది కాలనీలో తహసీల్ధార్ను దారుణంగా హత్య చేశారు. కొద్ది రోజుల కిందటి వరకూ విశాఖ రూరల్ తహసీల్ధార్గా పనిచేసిన సనపల రమణయ్యను ఇటీవల విజయనగరం జిల్లా బంటుపల్లికి బదిలీ చేశారు. రమణయ్య ఇప్పటికీ మధురవాడలోని కొమ్మాది కాలనీలో ఓ అపార్టుమెంట్లో ఐదో అంతస్తులో నివాసం ఉంటున్నాడు. శుక్రవారం బంటుపల్లిలో విధులు ముగించుకుని రాత్రి పది గంటలకు కొమ్మాది చేరుకున్నారు. ఫోన్ రావడంతో అపార్టుమెంట్ నుంచి కిందకు దిగివచ్చిన సమయంలో దారుణ హత్యకు గురయ్యాడని పోలీసులు చెబుతున్నారు.
భూ వివాదాలే తహసీల్ధార్ దారుణ హత్యకు కారణంగా అనుమానిస్తున్నారు. రాత్రి పది గంటలకు ఇంటి నుంచి కిందకు వచ్చిన తహసీల్ధార్తో ఓ వ్యక్తి గొడవ పడ్డట్లు తెలుస్తోంది. అక్కడే దుండగుడు తహసీల్దార్ రమణయ్యను రాడ్తో కొట్టిచంపినట్లు సీసీటీవీ ఫుటేజీ ద్వారా వెల్లడైంది. దాడి తరవాత స్థానికులు రమణయ్యను ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అర్థరాత్రి మృతిచెందినట్లు డాక్టర్లు ప్రకటించారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దాడికి కారణాలను ఆరా తీస్తున్నారు. తహసీల్దార్ హత్యతో రాష్ట్రం ఉలిక్కిపడింది.