భూ కుంభకోణంలో మనీలాండరింగ్ కేసు ఎదుర్కొంటోన్న ఝార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్‌ను (jmm leader hemant soren) ఐదు రోజుల కస్టడీకి రాంచీ హైకోర్టు అనుమతించింది. మనీలాండరింగ్ కేసులో బుధవారంనాడు హేమంత్ సోరెన్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. హేమంత్ సోరెన్ అక్రమ డబ్బుతో 8.5 ఎకరాల భూమి కొనుగోలు చేశారని ఈడీ ఆరోపిస్తోంది.
మొదటిసారిగా 2023, ఏప్రిల్ పదమూడున ఈడీ అధికారులు సోరెన్ నివాసంతో తనిఖీలు చేసి, భూమి కొనుగోలు పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. తాజాగా సోరెన్ నివాసంలో 36 లక్షల నగదు, లగ్జరీ కారు, విలువైన పత్రాలు సీజ్ చేశారు. రెవెన్యూ అధికారులతో కలసి తప్పుడు డీడ్ పత్రాలతో కోట్లాది రూపాయల భూముల కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ ఆరోపిస్తోంది.
తన అరెస్టును సవాల్ చేస్తూ హేమంత్ సోరెన్ సుప్రీంకోర్టును ఆశ్రయించినా ఫలితం దక్కలేదు. రాంచీ హైకోర్టుకు వెళ్లాలని సర్వోన్నత న్యాయస్థానం సూచించింది. ఈకేసులో జోక్యం చేసుకోలేమని ముగ్గురు సభ్యులధర్మాసనం తేల్చి చెప్పింది. హైకోర్టును ఎందుకు ఆశ్రయించలేదని సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రశ్నించింది. హేమంత్ సోరెన్ తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. తప్పుడు పత్రాలు, తప్పుడు అమ్మకందారులు, కొనుగోలుదారులను సృష్టించి కోట్లాది రూపాయల భూ కుంభకోణానికి పాల్పడ్డారని ఈడీ తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు.