RSS issues legal notices to Kerala Youth Congress President
కేరళ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
రాహుల్ మన్కూత్తత్తిల్, తమిళ రచయిత సలమాలకు రాష్ట్రీయ స్వయంసేవక సంఘం లీగల్
నోటీసులు పంపించింది. సంఘం గురించి తప్పుడు ప్రకటనలు చేయడాన్ని ఖండిస్తూ, ఆ
ప్రకటనలను ఉపసంహరించుకోవాలనీ, సంఘానికి బేషరతుగా క్షమాపణలు చెప్పాలనీ లీగల్
నోటీసులు పంపించింది.
కేరళలోని మలప్పురంలో ఇటీవల
యాంటీ-ఫాసిస్ట్ సంగమం పేరుతో ఆ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఒక కార్యక్రమం నిర్వహించింది.
అందులో భాగంగా, మహాత్మా గాంధీ హత్యలో ఆర్ఎస్ఎస్ ప్రమేయం ఉందంటూ ఆరోపణలు చేసారు.
ముఖ్యంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు
రాహుల్ మన్కూత్తత్తిల్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలోఆర్ఎస్ఎస్ గురించి
అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీని క్షమాపణలు చెప్పాలంటూ ఆదేశించిన
సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి మన్కూత్తత్తిల్ అవమానకర వ్యాఖ్యలు చేసారు.
ఆ కార్యక్రమం జరగడానికి ముందు, ఆర్ఎస్ఎస్పై
విద్వేషం వెదజల్లుతూ మలప్పురంలో పోస్టర్ల ద్వారా దుష్ప్రచారం చేసిన మలప్పురం
జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు హారిస్ ముత్తూర్, ఉపాధ్యక్షులు నిధీష్, ప్రజిత్,
విశ్వనాథన్లకు కూడా ఆర్ఎస్ఎస్ మరో లీగల్ నోటీసు పంపింది. ఆ పోస్టర్లలో గాంధీ
హత్యకు సంఘమే బాధ్యురాలంటూ తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసారు.
సంఘం ప్రతిష్ఠను దెబ్బతీయడానికి,
మైనారిటీలను భయభ్రాంతులను చేయడానికి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసినందుకు
ఆర్ఎస్ఎస్ చట్టపరంగా ఈ చర్యలు తీసుకుంది. ఆర్ఎస్ఎస్ను దుష్ట సంస్థగా చూపడం ద్వారా
మైనారిటీల హక్కుల కోసం పోరాడుతున్నది తామే అన్నట్టు చిత్రీకరించే ప్రయత్నం చేయడం,
యూత్ కాంగ్రెస్ అవకాశవాద ఓటుబ్యాంకు రాజకీయాలకు నిదర్శనమని విమర్శకులు
వాదిస్తున్నారు.
గతంలో చాలాసార్లు ఇటువంటి ప్రచారం
చేసినప్పుడల్లా పలు కమిషన్ నివేదికలు సంఘానికి వ్యతిరేకంగా చేస్తున్న ప్రచారం
తప్పుడు ప్రచారమనీ, మహాత్మా గాంధీ హత్యకూ రాష్ట్రీయ స్వయంసేవక సంఘానికీ ఎలాంటి
సంబంధం లేదనీ నిర్ధారించాయి. అయినా పదేపదే అదే అసత్యాన్ని ప్రచారం చేయడం ద్వారా రాజకీయ
లబ్ధి కోసం యూత్ కాంగ్రెస్ విద్వేష ప్రచారాలు కొనసాగిస్తోంది.
ఆర్ఎస్ఎస్
కేరళ యూత్ కాంగ్రెస్కు లీగల్ నోటీసులు పంపడం ద్వారా, తమ ప్రతిష్ఠకు భంగం
కలిగించేలా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వారిపై కఠిన వైఖరి ప్రదర్శించింది.
నిరాధార ఆరోపణలను పదేపదే చేస్తున్నవారు జవాబుదారీతనంతో వ్యవహరించాలంటూ డిమాండ్
చేసింది. ప్రజల్లో భయాందోళనలు కలిగించేలా తప్పుడు సమాచారం ద్వారా ప్రజల్లో
విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నాలను ఖండిస్తూ, సత్యం పట్ల తమ నిబద్ధతను
చాటుకుంది.