Capital Expenditure increased to Rs11.11 Lakh Crores
కేంద్రప్రభుత్వం 2024-25 ఆర్థిక సంవత్సరంలో
మూలధన వ్యయాన్ని 11.1శాతం, అంటే రూ.11.11లక్షల కోట్లకు పెంచాలని ప్రతిపాదించింది.
ఆ విషయాన్ని మధ్యంతర బడ్జెట్లో నిర్మలా సీతారామన్ వెల్లడించారు.
మోదీ ప్రభుత్వం గతేడాది మూలధన వ్యయాన్ని
33శాతం, అంటే రూ.10లక్షల కోట్లకు పెంచింది. అది దేశ జీడీపీలో 3.3 శాతానికి సమానం.
మూలధన వ్యయాన్ని భారీగా పెంచడం… దేశంలో
అభివృద్ధి సామర్థ్యాన్నీ, ఉద్యోగ కల్పననూ గణనీయంగా పెంచుతుంది. దానివల్ల
పెద్దమొత్తంలో ప్రైవేటు మదుపులు పెరుగుతాయి. అంతర్జాతీయ ప్రతికూల పరిస్థితులను
ఎదుర్కొనేందుకు సాయపడుతుంది.
‘‘2014లో దేశం భారీ
సవాళ్ళను ఎదుర్కొంటోంది. వాటిని తట్టుకుని నిలబడిన శక్తి మా ప్రభుత్వానిది. భారత
ప్రభుత్వం అలాంటి సవాళ్ళు అన్నింటినీ అధిగమించింది, విధాన పరమైన సంస్కరణలు,
ప్రజానుకూల సంస్కరణలూ చేపట్టాము. ఉద్యోగాలు,
పారిశ్రామిక కల్పనకు అనువైన పరిస్థితులు ఏర్పరిచాము. అభివృద్ధి ఫలాలు ప్రజలకు
అందడం మొదలైంది. దేశానికి ఓ కొత్త ప్రయోజనం, ఆశ కలిగాయి’’ అని నిర్మల చెప్పారు.
‘‘మా రెండో దఫా పాలనలో
ప్రభుత్వం తన ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రాన్ని మరింత బలపరిచింది. సామాజికంగా
భౌగోళికంగా సమృద్ధిని సాధించాం. కోవిడ్ 19 మహమ్మారిని, దానివల్ల ఎదురైన సవాళ్ళను
దేశం అధిగమించింది. ఆత్మనిర్భర భారతం దిశగా దేశం పయనించింది, అమృతకాలానికి బలమైన
పునాదులు వేయగలిగింది’’ అని వివరించారు.
సర్వసమగ్రమూ, సర్వ
సమృద్ధమూ సర్వ ప్రయోజనకరమూ అయిన అభివృద్ధిని సాధించే దిశగా తమ ప్రభుత్వం కృషి
చేస్తోందని నిర్మలా సీతారామన్ చెప్పారు. అన్నిస్థాయులలోని ప్రజలకూ ప్రయోజనం
కలిగేలా 2047 నాటికి దేశాన్ని వికసిత భారతంగా తీర్చిదిద్దే దిశగా పని
చేస్తున్నామని వెల్లడించారు.