పేదరిక
నిర్మూలనే లక్ష్యంగా దేశం ముందుకెళుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. గత
పదేళ్ళలో 25 కోట్ల మంది పేదరికం నుంచి
బయటపడ్డారన్నారు. తన చిన్నప్పటి నుంచి ‘గరీబీ హటావో’ నినాదం గురించి వింటూనే
ఉన్నానని కానీ, జీవితంలో మొదటి సారి గడిచిన పదేళ్ళలో పేదరిక నిర్మూలనను చూస్తున్నానని
పేర్కొన్నారు.
బడ్జెట్
సమావేశాల సందర్భంగా కొత్త పార్లమెంటు భవనంలో ఉభయసభలను ఉద్దేశించి మాట్లాడిన
ద్రౌపది ముర్ము, ప్రభుత్వ విధానాలపై
పార్లమెంటులో అర్థవంతమైన చర్చ జరగాలని సూచించారు.
ఎన్నో
ఏళ్ళ స్వప్నమైన రామమందిర నిర్మాణం జరగడం దేశానికి శుభపరిణామం అన్నారు. ఎన్నో
ఆటంకాలు అధిగమించి మందిర నిర్మాణం చేశామన్నారు. భారత సంస్కృతి, సభ్యత, ఎంతో
చైతన్యవంతమైనవి అన్నారు.
చంద్రుడి
దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన తొలి దేశంగా నిలవడంతో పాటు భూమి నుంచి 15 లక్షల
కిలోమీటర్ల దూరంలో ఉన్న కక్ష్యలోకి ఆదిత్య ఎల్-1 ప్రవేశించిందన్నారు.
దేశమంతా
తాగునీటి వసతి కల్పించేందుకు కేంద్రప్రభుత్వం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తోందన్నారు.
11 కోట్ల మందికి సురక్షిత తాగునీరు అందించగల్గుతున్నామన్నారు.
కరోనా సమయంలో 80
కోట్ల మందికి ఉచితంగా రేషన్ అందించగల్గామన్నారు. రూ. 7 లక్షల ఆదాయం వరకు పన్ను
లేకుండా చేయడంతో పాటు సామాన్యులకు భారం పడకుండా పన్ను సంస్కరణలు తీసుకొచ్చిన
విషయాన్ని గుర్తు చేశారు. కిసాన్ సమ్మాన్ ద్వారా 10 కోట్ల మందికి పెట్టుబడి సాయం
అందజేసి అండగా నిలిచిందన్నారు.
కేంద్రప్రభుత్వం
చేపట్టిన చర్యలతో రెండు కోట్ల మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారన్నారు.
నారీశక్తి వందన్ అధినీయం ద్వారా మహిళలకు 33 శాతం రిజర్వేషన్ లభించిందన్నారు.
భగవాన్ బిర్సా ముండా పుట్టినరోజును ‘జన్ జాతీయ
దివస్’ గా ప్రభుత్వం నిర్వహిస్తోందన్నారు. ఆదివాసీ యోధులను స్మరించుకోవడం దేశానికే
గర్వకారణమన్నారు. తెలంగాణలో సమ్మక్క-సారక్క గిరిజన వర్సిటీ ప్రారంభంకానుందన్నారు.
ఆసియా క్రీడల్లో 107, పారా ఒలంపిక్స్ లో 111
పతకాలు భారత్ సాధించిందని కొనియాడిన రాష్ట్రపతి ముర్ము, అన్ని రంగాల్లోనూ భారత్
పురోగమిస్తోందన్నారు.