బీజేపీ నాయకుడు రంజిత్ శ్రీనివాసన్ దారుణ హత్య కేసులో కేరళలోని అలప్పుళ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిషేధిత ఇస్లామిక్ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియాతో సంబంధాలున్న 15 మందికి, బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్ హత్య కేసుతో (kerala crime news)సంబంధం ఉందని తేలడంతో అలప్పుళ కోర్టు మరణశిక్ష విధించింది. అలప్పుళ న్యాయమూర్తి జస్టిస్ మవెళిక్కర అడిషనల్ జిల్లా జడ్జి వి.జి.శ్రీదేవి తీర్పు వెలువరించారు.
బీజేపీ నాయకుడి హత్యలో నిందితులందరికీ శిక్ష పడింది. వీరంతా మనుషులను చంపడంలో శిక్షణ పొందిన ముఠా అని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. బీజేపీ ఓబీసీ నేత రంజిత్ శ్రీనివాసన్ను ( ranjith srinevaasan murder case) ఈ కరుడుగట్టిన ముఠా ఆయన భార్య, పిల్లలు, తల్లి చూస్తుండగానే చంపివేశారు. ఇలాంటి దారుణాలు చాలా అరుదుగా మాత్రమే జరుగుతాయని న్యాయమూర్తి తీర్పు కాపీలో వ్యాఖ్యానించారు.
కేసు వివరాల్లోకి వెళితే…
2021 డిసెంబరు 19 అలప్పుళ పట్టణంలో బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి రంజిత్ శ్రీనివాసన్ హత్య జరిగింది. నిషేధిత ఎస్డీపీఐ, పీఎఫ్ఐ కార్యకర్తలు రంజిత్ ఇంట్లోకి చొరబడి అంత్యంత దారుణంగా హత్య చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు కొందిరిని అరెస్టు చేసి విచారించారు. అదనపు సెషన్స్ కోర్టులో కేసు విచారణ సాగింది. తాజాగా న్యాయమూర్తి 15 మందికి మరణ శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు.
రంజిత్ హత్యకు ముందు రోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నేత కేఎస్ షాన్ హత్య జరిగింది. ఆ తరవాత రోజే రంజిత్ హత్య జరగడం అప్పట్లో తీవ్ర సంచలనం అయింది.