DMK MLA’s son and daughter in law arrested and sent to judicial remand
పనిమనిషిని వేధించిన ఆరోపణలపై డీఎంకే ఎమ్మెల్యే ఐ
కరుణానిధి కొడుకు, కోడలు అరెస్ట్ అయ్యారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్
విధించింది.
ఎమ్మెల్యే కరుణానిధి కొడుకు ఆండ్రో మదివాణన్,
అతని భార్య మార్లీనా ఇంట్లో 18ఏళ్ళ దళిత యువతి పనిచేస్తోంది. ఆమె ఉలుందుర్పేట
ప్రభుత్వ ఆస్పత్రిలో గాయాలతో చేరింది. ఆ విషయం తెలియడంతో నీలంగరై మహిళా పోలీసు స్టేషన్
అధికారులు ఆస్పత్రిలో విచారణ జరిపారు.
ఆండ్రో మదివాణన్ దంపతులు తనను ప్రతీరోజూ
హింసించేవారని బాధితురాలు పోలీసులకు చెప్పింది. వాళ్ళతోపాటు ముంబై వెళ్ళినప్పుడు
సరిగ్గా వంట చేయలేదంటూ తనపై దాడిచేసారని చెప్పింది. తనతో బలవంతంగా పచ్చిమిరపకాయలు
తినిపించారని వెల్లడించింది. ఒళ్ళంతా వాతలు పెట్టారనీ, రక్తం వచ్చేలా కొట్టారనీ
పోలీసులకు వివరించింది. మూడేళ్ళపాటు వారింట్లో పనిచేయాల్సిందేనంటూ తనతో సంతకం
చేయించుకున్నారని చెప్పింది.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలి నుంచి
పోలీసులు వాంగ్మూలం తీసుకున్నారు. దాని ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదుచేసారు. షెడ్యూల్డు
కులానికి చెందిన యువతిపై భౌతికదాడి చేసినట్లు, ఆమెను దూషించినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు గురువారం ఆండ్రో మదివాణన్ దంపతులను అరెస్ట్ చేసారు.
ఇవాళ కోర్టులో ప్రవేశపెట్టారు. కోర్టు వారికి జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
కేసు విషయం తెలిసిన ఎమ్మెల్యే కరుణానిధి
స్పందించారు. తన కొడుకు వేరేగా నివసిస్తున్నాడని, ఈ గొడవ గురించి తమకు తెలియదనీ
చెప్పారు.