Devotees take holy dip at Triveni Sangam during Magh Mela
మాఘమేళాలో రెండవ పవిత్రదినమైన పౌష్య పూర్ణిమ
సందర్భంగా ప్రయాగలోని త్రివేణీసంగమంలో పెద్దసంఖ్యలో భక్తులు పవిత్రస్నానాలు
ఆచరించారు.
ఉత్తరప్రదేశ్‌లో గంగాయమునాసరస్వతీ నదుల త్రివేణీసంగమ
ప్రాంతమైన ప్రయాగ (అలహాబాద్) పౌష్యపూర్ణిమ సందర్భంగా జనసముద్రమయింది. ఈ సందర్భాన్ని
పురస్కరించుకుని పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేసారు. ప్రయాగ అంతటినీ సీసీటీవీలతో క్షుణ్ణంగా
పరిశీలిస్తున్నామని, భక్తుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేసామనీ డీఐజీ రాజీవ్ నారాయణ్
మిశ్రా తెలియజేసారు. ‘‘పవిత్రస్నానాలు చేసే భక్తుల భద్రత కోసం త్రివేణీసంగమంలో
బ్యారికేడ్లు, వలలు అమర్చాం. సుశిక్షితులైన గజయీతగాళ్ళు, జల్‌పోలీస్, ఫ్లడ్
కంపెనీలు, ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ దళాలూ అందుబాటులో ఉన్నారు’’ అని చెప్పారు.
‘‘మొత్తం ప్రదేశమంతా సీసీటీవీలతో పర్యవేక్షిస్తున్నాం.
డ్రోన్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పెద్దసంఖ్యలో వచ్చిన భక్తురాళ్ళ సౌకర్యార్థం మహిళా
కానిస్టేబుళ్ళు కూడా అందుబాటులో ఉన్నారు. బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లు, డాగ్
స్క్వాడ్లు, ఆర్ఏఎఫ్ బృందాలు, ఏటీఎస్ కమాండోలతో పాటు పోలీస్ గుర్రాలను కూడా మోహరించాం’’
అని వివరించారు.
త్రివేణీసంగమ స్థానంలోని వేర్వేరు ఘాట్ల వద్ద ఇప్పటివరకూ
సుమారు 2లక్షల మంది భక్తులు పవిత్రస్నానాలు చేసారు. ఈ సంవత్సరపు మాఘమేళాలో మొదటి
పవిత్రస్నానం మకర సంక్రాంతి రోజున అంటే జనవరి 15న జరిగింది. ఆరవదీ, ఆఖరిదీ అయిన
పవిత్రస్నానం మార్చి 8 మహాశివరాత్రి నాడు జరుగుతుంది.