కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ, ఆ పార్టీకి చెందిన
మరికొందరు నాయకులపై అస్సాం పోలీసులు మంగళవారం ఎఫ్‌ఐఆర్ నమోదు చేసారు. ఆ విషయాన్ని
ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ వెల్లడించారు.
‘‘హింసాత్మక ఘటనలు, ప్రజలనురెచ్చగొట్టడం, ప్రజా
ఆస్తులకు నష్టం కలిగించడం, పోలీసు సిబ్బందిపై దాడి వంటి చర్యలకు కారణమైన
కాంగ్రెస్ నేతలు రాహుల్ గాంధీ, కె.సి.వేణుగోపాల్, కన్హయ్య
కుమార్ సహా ఇతర వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేశారు’’ అని హిమంత బిశ్వశర్మ
‘ఎక్స్’లో ట్వీట్ చేశారు.
కాంగ్రెస్ నాయకుల చర్యలపై సుమోటోగా కేసు నమోదు
చేసామని గువాహటి పోలీస్ కమిషనర్ దిగంత బోరా వెల్లడించారు. భారత్ జోడో న్యాయ్
యాత్రను నగరంలోని రద్దీ ప్రాంతాల్లో చేయవద్దని షరతు విధించామని తెలిపారు. అనుమతి
ఉన్న మార్గంలోనే వెళ్లాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయన్నారు. ఐనా నాయకులు
రెచ్చగొట్టడంతో యాత్రలో పాల్గొన్నవారు నిర్దేశిత మార్గాన్ని అనుసరించకుండా
నగరంలోకి ప్రవేశించే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బారికేడ్లను తోసుకొని
ముందుకెళ్లాలని నాయకులే ప్రోత్సహించినట్లు పేర్కొన్నారు. దీంతో కార్యకర్తలు
రెచ్చిపోయి పోలీసులపై దాడి చేసారని, ఆ దాడిలో నలుగురు పోలీసులు గాయపడ్డారని
తెలిపారు.
అంతకుముందు అస్సాం-మేఘాలయ సరిహద్దులో రాహుల్
గాంధీ ప్రసంగిస్తూ కేంద్రం, అస్సాం ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. హిమంత
బిశ్వశర్మకు అమిత్ షా ఫోన్ చేసి తనను అడ్డుకోవాలని ఆదేశించారని ఆరోపించారు. వాళ్ళ
గుండెల్లో భయమున్నందునే తనపై కేసు నమోదు చేయాలని సీఎం నేరుగా డీజీపీని ఆదేశించారని
చెప్పారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర గువాహటి నగరంలోకి
యాత్ర ప్రవేశించకుండా పోలీసులు మంగళవారం భారీగా బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో
ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కాంగ్రెస్ కార్యకర్తలు బారికేడ్లను తోసుకుని
ముందుకు దూసుకెళ్లారు. వారిని అడ్డుకునేందుకు పోలీసులు చేసిన ప్రయత్నం ఫలించలేదు.
అసోంలో రాహుల్ గాంధీ భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే లేఖ రాశారు. అసోంలో భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా రాహుల్ కు భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, అనేక భద్రతా లోపాలు వెలుగుచూశాయని ఖర్గే ఆరోపించారు. ఆ మేరకు అనేక ఘటనలను తన లేఖలో ప్రస్తావించారు. ముఖ్యంగా, జనవరి 22న నాగావ్ జిల్లాలో రాహుల్ గాంధీ కాన్వాయ్ ని బిజెపి కార్యకర్తలు అడ్డుకున్నారని, వారు రాహుల్ గాంధీకి అత్యంత సమీపానికి వచ్చారని ఖర్గే ఆందోళన వ్యక్తం చేశారు. అంత జరుగుతున్నా అసోం పోలీసులు ప్రేక్షకుల్లా చూస్తూ ఉన్నారని, కొన్నిసార్లు పోలీసులే దగ్గరుండి బిజెపి కార్యకర్తలను రాహుల్ కాన్వాయ్ లోకి పంపించారని ఖర్గే ఆరోపించారు. ఇప్పటివరకు అసోం పోలీసులు ఎవరినీ అరెస్ట్ చేయకపోవడం శోచనీయం అని పేర్కొన్నారు. రాహుల్ యాత్ర ముందుకు సాగేకొద్దీ ముప్పు అధికమవుతోందని, ఇకనైనా మీరు జోక్యం చేసుకోవాలని అమిత్ షాను కోరారు. రాహుల్ యాత్రకు తగిన భద్రత కల్పించేలా అసోం ముఖ్యమంత్రి, డీజీపీలకు దిశానిర్దేశం చేయాలని ఖర్గే తన లేఖలో విజ్ఞప్తి చేశారు.