అయోధ్యలో
రామాలయ నిర్మాణంతోనే మన పని పూర్తి కాలేదన్న ప్రధాని మోదీ, బడుగు బలహీన వర్గాల
జీవితాల్లో వెలుగులు నింపాల్సి ఉందన్నారు. సర్వ శక్తులు కూడదీసుకుని దేశ వికాసానికి
శ్రమించాలని పిలుపునిచ్చారు. దేవ్ సే దేశ్, రామ్ సే రాష్ట్ర నినాదంతో ముందుకు
సాగాలని అయోధ్య సభ సాక్షిగా మార్గనిర్దేశం చేశారు.
రామమందిర
నిర్మాణం పూర్తికావడంతో ఇక అయోధ్య రాముడు టెంట్ లో ఉండాల్సిన అవసరం లేదన్నారు.
దివ్య మందిరంలో అయోధ్యాదీశుడు కొలువుదీరాడన్నారు. జనవరి 22, 2024 కేవలం తేదీ
మాత్రమే కాదన్న మోదీ, కొత్త కాలచక్రానికి ప్రతీకగా అభివర్ణించారు. ఈ సమయానికి
పరిపూర్ణ దివ్యత్వం ఉందన్నారు. వందల ఏళ్ల తర్వాత కూడా ప్రజలు ఈ తేదీని
గుర్తుంచుకుంటారన్నారు.
రామాలయ
నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు ఎదురయ్యాయని, కానీ చివరకు న్యాయమే గెలిచిందని ప్రధాని
అన్నారు. ఇందుకు న్యాయ వ్యవస్థకు ధన్యవాదాలు తెలిపారు.
భారతదేశ
సంస్కృతి కట్టుబాట్లకు రాముడే మూలమన్న ప్రధాని మోదీ, రాముడే భారత్ ఆధారమన్నారు. ‘‘
రాముడు వివాదం కాదు సమాధానమన్నారు. రాముడే వెలుగు అతడే విశ్వాత్మ’’ అని మోదీ
కీర్తించారు.