అయోధ్య
రామయ్యకు దేశ విదేశాల నుంచి కానుకలు వెల్లువెత్తుతున్నాయి. కుల, మత, ప్రాంతాలకు
అతీతంగా శ్రీరాముడిపై భక్తిశ్రద్ధలను ప్రదర్శిస్తున్నారు.
ముస్లిం
ఛాందసవాద దేశంగా పేరున్న ఆప్ఘనిస్తాన్ నుంచి అయోధ్యకు ప్రత్యేక కానుక అందినట్లు
విశ్వహిందూ పరిషత్ ప్రెసిడెంట్ అలోక్ కుమార్ తెలిపారు.
కాబూల్ లో ప్రవహించే కూబా
నది జలాలను శ్రీరాముడికి కానుకగా పంపించారని తెలిపారు. స్వామివారి అభిషేకం కోసం
వీటిని పంపినట్లు తెలిపారు.
ఇక
కశ్మీరు ముస్లింలు పంపిన కానుక ఏంటో తెలుసుకుంటే ఆశ్చర్యపోవాల్సిందే.
సేంద్రియ
పద్ధతిలో పండించిన రెండు కిలోల కుంకుమను శ్రీరాముడికి పంపారని అలోక్ కుమార్
తెలిపారు. తాము అత్యంత ఎక్కువ అభిమానించే పూర్వీకుల్లో రాముడు ఒకరని కశ్మీర్
ముస్లింలు చెప్పారన్నారు. రామ మందిర నిర్మాణంపై వారంతా హర్షం వ్యక్తం చేశారన్నారు.
మతాలు వేరైనా మన పూర్వీకులంతా ఒకటేనని వారు తనతో అన్నారన్నారు.
మరికొన్ని
గంటల్లో బాలరాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం జరగనుండటంతో అయోధ్య సర్వాంగ
సుందరంగా ముస్తాబైంది. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం తర్వాత రోజుకు లక్ష మంది చొప్పున
భక్తులు అయోధ్యకు వచ్చే అవకాశముందని అంచనా వేస్తోన్నారు.
ఆలయ నిర్మాణం ప్రారంభానికి
ముందు రోజుకు సగటున 15 వందల నుంచి 2 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకునే వారు.
నిర్మాణ పనులు మొదలైన తర్వాత 15 వేల నుంచి 20 వేలకు భక్తుల సంఖ్య పెరిగిందని
రామజన్మభూమి ట్రస్ట్ తెలిపింది. ప్రాణప్రతిష్ఠ క్రతువు ఆరంభం కావడంతో ప్రస్తుతం
రోజుకు 50 వేల మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు.