Ram Janmbhoomi Trust slams Rahul Gandhi labelling consecration ceremony as BJP event
అయోధ్యలో జనవరి 22న జరగబోయే బాలరాముడి
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు హాజరవడం లేదు. దానికి ఆ పార్టీ చెప్పిన
కారణం ఏంటంటే అది ‘బీజేపీ కార్యక్రమం’ అట. కాంగ్రెస్ చేసిన ఆ వ్యాఖ్యపై
శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ సభ్యుడు కామేశ్వర్ చౌపాల్ మండిపడ్డారు.
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ అయోధ్యలో
ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని బీజేపీ చేపట్టిన రాజకీయ కార్యక్రమం అంటూ చులకనగా
మాట్లాడడాన్ని కామేశ్వర్ చౌపాల్ మండిపడ్డారు. 1949లో అయోధ్యలో బాలరాముడి విగ్రహం
వెలసినప్పుడు అప్పటి ప్రధానమంత్రి జవాహర్‌లాల్ నెహ్రూ ఆ అవకాశాన్ని
అందిపుచ్చుకుని ఆలయం కట్టి ఉండాల్సిందన్నారు. నెహ్రూ ఉద్దేశపూర్వకంగానే అలా చేయలేదని
రాహుల్ గాంధీకి గుర్తు చేసారు.
‘‘75ఏళ్ళ క్రితం ఒక అవకాశం వచ్చింది. 1949లో
రామ్‌లల్లా మూర్తి వెలసినప్పుడు, ఆనాడు ప్రధానమంత్రిగా ఉన్న జవాహర్‌లాల్ నెహ్రూ ఆ
అవకాశాన్ని ఎందుకు అందిపుచ్చుకోలేదు? వారే రామమందిరం నిర్మించి ఉంటే ఇవాళ బీజేపీ
దానిగురించి మాట్లాడవలసిన అవసరమే వచ్చేది కాదు కదా’’ అని చౌపాల్ వ్యాఖ్యానించారు.
‘‘వాళ్ళు అప్పుడు ఆ పని ఎందుకు చేయలేదు? రామమందిరం
నిర్మించి ఆ క్రెడిట్ మొత్తం తీసుకుని ఉండవచ్చు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్ ఈ
భారతదేశపు ఆత్మను అర్ధం చేసుకోలేరు. రాముడు, కృష్ణుడు, శివుడు ఈ దేశపు ఆత్మలని గాంధీకి
తెలుసు. ఆ ముగ్గురూ లేని భారతదేశాన్ని కనీసం ఊహించలేం’’ అన్నారు కామేశ్వర్ చౌపాల్.
‘‘రాముడు ఒక కల్పిత పాత్ర మాత్రమేనని
కాంగ్రెస్ కోర్టులో చెప్పింది. అలాంటివాళ్ళు రామమందిరానికి ఎలా రాగలరు? ఈ దేశంలో
రాముడికి వ్యతిరేకంగా ఎవరూ నిలువలేరు. వీళ్ళు కూడా నిలబడలేరు’’ అని ఆయన
వ్యాఖ్యానించారు.
ప్రతిపక్షాల ఇండీ కూటమి నాయకులు అందరూ,
రామమందిరం అంశాన్ని బీజేపీ రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో లబ్ధి పొందడం కోసం, ఎన్నికల
ప్రయోజనాల కోసం ఉపయోగించుకుంటోందని విమర్శిస్తున్నారు.