Violence In Manipur,
Commando Killed
మణిపూర్‌లో మళ్ళీ హింస చెలరేగింది.
ఇప్పుడిప్పుడే అల్లర్లు సద్దుమణిగి సాధారణ పరిస్థితులు ఏర్పడుతున్నాయనుకునే సమయంలో
మళ్లీ హింసాత్మక ఘటన జరిగింది. ఏకంగా భద్రతా బలగాలపైనే ఆందోళనకారులు బాంబులు,
రాకెట్ ఆధారిత షెల్స్‌తో దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ పోలీసు ఉన్నతాధికారి
ప్రాణాలు కోల్పోయాడు. దేశ సరిహద్దు గ్రామం మోరే పరిధిలో ఈ ఘటన జరిగింది.
భద్రతా
సిబ్బందే లక్ష్యంగా తెల్లవారు జాము నుంచే కొందరు దుండగులు కాల్పులకు దిగారు.
ఆర్పీజీ షెల్స్ తో దాడి చేయడంతో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఇటీవల మోరే
ప్రాంతంలో ఓ పోలీసు అధికారి హత్య జరిగింది. కేసు విచారణలో భాగంగా ఇద్దరు
అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. దీంతో కుకీలు ఆందోళనకు దిగారు. మోరే నుంచి
పోలీసులను పంపించాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో కమాండో పోస్టుపై బాంబు
విసిరారు. ఈ దాడికి పాల్పడింది కుకీ మిలిటెంట్లేనని పోలీసులు అనుమానిస్తున్నారు.
గత ఏడాది అక్టోబర్ లో సబ్ డివిజినల్ పోలీస్ ఆఫీసర్ ఆనంద్ హత్య కేసుకు సంబంధించి
ఫిలిప్ ఖోంగ్ సాయి, హేమోఖోలాల్ మేట్ లను పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం కోర్టులో
ప్రవేశపెట్టగా న్యాయమూర్తి తొమ్మిది రోజులు జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. వీరిని
విడుదల చేయాలని కుకీలు ఆందోళన చేస్తున్నారు.