మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రాబునాయుడు సుప్రీంకోర్టులో స్కిల్ స్కాంపై వేసిన క్వాష్ పిటిషన్పై సుప్రీంకోర్టు ఇవాళ తీర్పు వెలువరించింది. ఈ కేసుపై సుదీర్ఘ వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం దాదాపు రెండు నెలల సమయం తీసుకుని తీర్పును వెలువరించింది. జస్టిస్ అనిరుద్ధబోస్, జస్టిస్ బేలా ఎం.త్రివేదిలతో కూడిన ద్విసభ్య ధర్మాసనం తీర్పు ఇచ్చింది. అయితే ద్విసభ్య ధర్మాసనంలోని ఇద్దరు న్యాయమూర్తులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ పై ఇద్దరు న్యాయమూర్తులు వేరువేరు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. కేసును సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి నివేదించారు. దీనిపై త్వరలో త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు చేసే అవకాశముంది.
స్కిల్ కేసులో మాజీ సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపిన సంగతి తెలిసిందే. అయితే 2018లో అవినీతి నిరోధక చట్టంలో చేసిన మార్పుల మేరకు, అవినీతి కేసుల్లో ప్రముఖులను అరెస్ట్ చేయాలంటే ముందస్తుగా గవర్నర్ అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. తన అరెస్ట్ విషయంలో ప్రభుత్వం గవర్నర్ అనుమతి తీసుకోలేదని అవినీతి నిరోధక చట్టంలోని 17ఏ తనకు వర్తిస్తుందని, కేసును కొట్టివేయాలంటూ చంద్రబాబు సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. అయితే కేసును కొట్టి వేసేందుకు సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం అనుమతి ఇవ్వలేదు. ప్రభుత్వం ఇప్పటికైనా గవర్నర్ అనుమతి తీసుకోవచ్చని జస్టిస్ అనిరుద్ధబోస్ తీర్పు కాపీలో వెల్లడించారు. ఈ పిటిషన్పై ద్విసభ్య ధర్మాసనంలో భిన్నమైన తీర్పులు రావడంతో, త్రిసభ్య ధర్మాసనానికి బదిలీ చేశారు.