Lord Ram chose PM Modi to build Ayodhya temple, said
Advani
శ్రీరామచంద్రమూర్తి జన్మించిన అయోధ్యలో (Ayodhya)
ఆయన ఆలయాన్ని ముస్లిం మొగల్ రాజు బాబర్ ధ్వంసం చేసిన సుమారు 500
సంవత్సరాల తర్వాత ఇన్నాళ్ళకు రామమందిర పునర్నిర్మాణం (Ram Temple)
జరుగుతోంది. మరికొద్దిరోజుల్లో రామ్‌లల్లా విగ్రహాన్ని నూతన మందిరంలో ప్రవేశపెట్టి
ప్రాణప్రతిష్ఠ (Consecration Ceremony) చేయనున్నారు. ఆ సందర్భాన్ని
పురస్కరించుకుని అయోధ్య ఉద్యమాన్ని ప్రారంభించిన సీనియర్ బీజేపీ నేత లాల్‌కృష్ణ
ఆఢ్వాణీ (Lal Krishna Advani) ‘రాష్ట్రధర్మ’ అనే పత్రికలో (Rashtra
Dharma magazine)ఒక వ్యాసం రాసారు.
‘అయోధ్యలో భవ్య రామమందిర నిర్మాణం జరగాలని విధి
రాసిపెట్టింది. అందువల్లనే మందిర నిర్మాణం సాధ్యమైంది. ఆ పని చేయడానికి
శ్రీరామచంద్రప్రభువు తన భక్తుడైన ప్రధానమంత్రి నరేంద్రమోదీని ఎంచుకున్నారు’ అని
ఆఢ్వాణీ తన వ్యాసంలో రాసారు. నరేంద్రమోదీకి రాజకీయ గురువు ఆఢ్వాణీ. అయితే 2014 ఎన్నికలకు
ముందు ఆఢ్వాణీని అతిక్రమించి, మోదీ బీజేపీ రాజకీయాల్లో పైకొచ్చారు. తన గురువును
ప్రధానమంత్రి లేదా రాష్ట్రపతి కాకుండా మోదీయే అడ్డుకున్నారన్న రాజకీయ విమర్శలున్నాయి. ఆఖరికి, ఇప్పుడు జరగబోతున్న రామమందిర ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి
ఆఢ్వాణీని రానీయకుండా ఆపడానికి ప్రయత్నించారన్న ఆరోపణలు సైతం వచ్చాయి. అలాంటి
తరుణంలో ఆడ్వాణీ తన శిష్యుణ్ణి ప్రశంసించడం ఆసక్తికరంగా నిలిచింది.
ఆఢ్వాణీ తన వ్యాసంలో రామమందిర నిర్మాణ ఘనత అంతా
భగవాన్ శ్రీరామచంద్రుడి భక్తులదేనని వ్యాఖ్యానించారు. 33ఏళ్ళ నాడు తాను చేపట్టిన
రథయాత్ర గురించి గుర్తు చేసుకున్నారు ఆఢ్వాణీ. ‘‘1990 సెప్టెంబర్ 25న మేము రథయాత్ర
ప్రారంభించినప్పుడు అది జాతీయస్థాయి ఉద్యమంగా మారుతుందని మేము అసలు ఊహించలేదు. ఆ
యాత్ర సమయంలో మోదీ నాకు సహచరుడు. అప్పటికి మోదీ అంత ప్రఖ్యాతి చెందిన నాయకుడు
కాదు. కానీ అప్పుడే రామచంద్రమూర్తి తన ఆలయ నిర్మాణానికి తన భక్తుడైన మోదీని
ఎంచుకున్నారు’’ అని ఆఢ్వాణీ రాసారు.
రాష్ట్రధర్మ పత్రిక కోసం ప్రత్యేకంగా రాసిన
వ్యాసంలో ఆఢ్వాణీ అయోధ్య ఉద్యమాన్ని తన రాజకీయ జీవితంలో అత్యున్నతమూ, మహత్తరమూ
అయిన సంఘటనగా పేర్కొన్నారు. ఆనాటి రథయాత్ర భారతదేశాన్ని పునర్దర్శించడానికి, ఆ
క్రమంలో తనను తాను మరోమారు అర్ధం చేసుకోవడానికీ తనకు సహాయపడింది అని ఆఢ్వాణీ
గుర్తు చేసుకున్నారు. ‘‘రథయాత్ర సమయంలో ఎన్నో అనుభవాలు నా జీవితాన్ని ప్రభావితం చేసాయి.
ఏదో ఒక మారుమూల గ్రామం నుంచి నాకు ఏమాత్రం తెలియని గ్రామస్తులు వస్తుండేవారు. అయోధ్య
లక్ష్యంగా నేను ప్రయాణిస్తున్న రథాన్ని చూసి వారు భావోద్వేగంతో
పరవశించిపోతుండేవారు. భగవాన్ శ్రీరామచంద్రుడిని ప్రార్థిస్తూ నినాదాలు
చేస్తుండేవారు. అలాంటి దృశ్యాలను పదేపదే చూసి, ఈ దేశంలోని కోట్లాది ప్రజలు
రామమందిరం కోసం ఎంతగా ఆరాటపడుతున్నారన్న విషయం నాకు అర్ధమయింది. ఈ జనవరి 22న కేవలం
రామమందిర ప్రతిష్ఠ మాత్రమే కాదు, అలాంటి అమాయక పల్లీయుల విశ్వాసం కూడా పునరుద్ధరించబడుతోంది’’
అని ఆఢ్వాణీ అభిప్రాయపడ్డారు.
‘‘అప్పట్లో, ఏదో ఒకరోజు అయోధ్యలో బ్రహ్మాండమైన భవ్య
రామమందిరం నిర్మాణం జరగాలని విధి నిర్ణయించిందని అనుకున్నాను. ఆ తరుణం ఇప్పుడు
ఆసన్నమయింది’’ అని ఆఢ్వాణీ తన వ్యాసంలో రాసుకొచ్చారు.
రామజన్మభూమి నిర్మాణం కోసం రథయాత్ర నిర్వహించి
దేశవ్యాప్తంగా ప్రజలను జాగృతులను చేసిన లాల్‌కృష్ణ ఆఢ్వాణీ ఈ సమయంలో దివంగత మాజీ ప్రధానమంత్రి
అటల్ బిహారీ వాజ్‌పేయీని గుర్తు చేసుకున్నారు. ‘‘ఆనాటి యాత్ర సమయంలో నేను కేవలం
రథయాత్రికుడిని మాత్రమే అన్న విషయం నాకు అవగతమైంది. రథయాత్ర ప్రధాన సందేశవాహకుడు
స్వయంగా ఆ రథమే. ఎందుకంటే, అయోధ్య రామమందిరాన్ని పునరుద్ధరించుకోవాలన్న సందేశాన్ని
ఆ రథం దేశం నలుమూలలా వ్యాపింపజేసింది’’ అన్నారు ఆఢ్వాణీ.
అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం ప్రజలు తమ జీవితాల్లో
రాముడి బోధనలను ఆచరించేలా సహాయపడాలని ఆఢ్వాణీ ప్రార్ధించారు. జనవరి 22న జరిగే
అయోధ్య బాలరాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు.