Terrorists’ activities increase in JK, Joint Conspiracy of Pakistan and China
జమ్మూకశ్మీర్లొని రాజౌరీపూంఛ్
సెక్టార్లో నిన్న శుక్రవారం మొదలైన ఎన్కౌంటర్ ఇవాళ కూడా కొనసాగుతోంది. 25-30 మంది
ఉగ్రవాదులు ఇప్పటికే భారత భూభాగంలోకి చొరబడి ఉంటారని భారత సైన్యం అంచనా వేసింది. ఇదంతా
పాకిస్తాన్-చైనా సంయుక్తంగా ఆడుతున్న నాటకమని భారత రక్షణ వర్గాలు
విశ్లేషిస్తున్నాయి. మరోవైపు అఖ్నూర్ సెక్టార్లో ఉగ్రవాదుల చొరబాటు ప్రయత్నాన్ని
భారత సైన్యం నిలువరించింది.
రాజౌరీ పూంఛ్ సెక్టార్లో (Rajouri Poonch Sector) ఉగ్రవాదులు గురువారం
రాత్రి చేసిన ఆకస్మిక దాడిలో నలుగురు భారత సైనికులు ప్రాణాలు కోల్పోయారు. (Terrorists attack Indian Army Convoy) జవాన్లను
తరలిస్తున్న సైనిక వాహనాలను లక్ష్యంగా చేసుకుని ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతోనే
దాడి చేసినట్లు సమాచారం. వెంటనే తేరుకున్న భారత సైనికులు ఉగ్రవాదులపై ప్రతిదాడి
ప్రారంభించారు. ఇవాళ కూడా ఎన్కౌంటర్ కొనసాగుతోంది.
జమ్మూ జిల్లా అఖ్నూర్ సెక్టార్లో (Akhnoor Sector) అంతర్జాతీయ సరిహద్దు (International Border) దాటి పాకిస్తాన్ నుంచి భారత్‌లోకి చొరబడడానికి ఉగ్రవాదులు చేసిన ప్రయత్నాన్ని భారత
సైన్యం విజయవంతంగా అడ్డుకుంది. (Infiltration Bid Foiled) గత అర్ధరాత్రి సమయంలో పాక్ సరిహద్దులు దాటి భారత్‌లోకి
రావడానికి నలుగురు ఉగ్రవాదులు ప్రయత్నించినట్లు నిఘా పరికరాల ద్వారా తెలిసిందని
భారత సైన్యానికి చెందిన వైట్ నైట్ కార్ప్స్ (White Knight Corps, Indian Army) ప్రకటించింది. అఖ్నూర్ సెక్టార్ ఖోర్ చొరబాటుకు
ప్రయత్నించిన ఉగ్రవాదులపై భారత సైనికులు కాల్పులు జరిపారు. ఆ దాడిలో ఒక ఉగ్రవాది
మరణించినట్లు తెలుస్తోంది. అతని శవాన్ని తీసుకుని మిగిలినవారు వెనక్కు మళ్ళారని
భారత సైన్యం ‘ఎక్స్’లో ట్వీట్ చేసింది.
రాజౌరీ-పూంఛ్ సెక్టార్లో భారత సైనికులపై కాల్పుల
వెనుక పెద్ద కుట్రే ఉన్నట్లు రక్షణ శాఖ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. సుమారు
25-30మంది పాకిస్తానీ ఉగ్రవాదులు ఆ ప్రాంతంలోని అడవుల్లో దాగి ఉన్నారని రక్షణ శాఖ
అంచనా. వారి విశ్లేషణ ప్రకారం…. ఆ ప్రాంతంలో ఉగ్రవాద కార్యకలాపాలు పెంచే
ప్రయత్నం వెనుక పాకిస్తాన్-చైనా దేశాల సంయుక్త కుట్ర (Pakistan China Joint Conspiracy) దాగి ఉంది. భారత సైన్యం 2020లో
పూంఛ్ సెక్టార్ నుంచి రాష్ట్రీయ రైఫిల్స్ బలగాలను లద్దాఖ్ వైపు పంపించాయి. అక్కడ
చైనా దురాక్రమణలను అడ్డుకోడానికి ఇక్కడి బలగాలను అక్కడికి తరలించారు. దాంతో లద్దాఖ్
ప్రాంతంలో చైనా పాచికలు పారడం లేదు. అక్కడినుంచి భారత సైన్యాలను తప్పించాలంటే
వారిని మళ్ళీ వెనక్కు వెళ్ళేలా చేయాలి. అందుకే చైనా ప్రోద్బలంతో పాకిస్తాన్ మళ్ళీ
రాజౌరీ-పూంఛ్ సెక్టార్‌లోకి ఉగ్రవాదులను పంపించడం మొదలుపెట్టింది.
ఈ వ్యూహాన్ని
అడ్డుకునేందుకు భారత్ ఇప్పటికే ప్రయత్నాలు ప్రారంభించింది. రాజౌరీ సెక్టార్‌కు ఒక
అదనపు బ్రిగేడ్‌ను తరలించింది. గత కొన్నాళ్ళుగా అక్కడ ఉగ్రవాద కార్యకలాపాలను అడ్డుకోగలిగింది.
ఇప్పుడు మళ్ళీ పాక్ చొరబాటుదార్లు దుస్సాహసానికి పాల్పడుతున్నారు. సుమారు 30మంది
పాకిస్తానీ ఉగ్రవాదులు రాజౌరీ సెక్టార్‌లోని అటవీప్రాంతంలోకి చొరబడినట్లు భారత
రక్షణశాఖ అంచనా వేసింది. వారిని ఏరివేసేందుకు చర్యలు ప్రారంభించింది.