Srinivasa Ramanujan Birth Anniversary : National Mathematics Day
శ్రీనివాస రామానుజన్ (1887-1920) (Srinivasa Ramanujan) ప్రపంచంలోని గొప్ప గణిత మేధావుల్లో ఒకడు. ఆయన జీవితంలో గణితమూ,
మార్మికతా మాత్రమే ఉన్నాయి. గణితం గురించి ప్రస్తావించకుండా రామానుజన్ జీవితం
గురించి చెప్పడం అసాధ్యం అని ఆయన జీవితచరిత్ర రాసిన రాబర్ట్ కనిగెల్ (Robert Kanigel) అంటాడు. ఆయన శ్రీనివాస రామానుజన్ని ‘అనంతం గురించి తెలిసినవాడు’ అని
ప్రస్తావిస్తాడు. రామానుజన్ కుటుంబం, సామాజిక వర్గం గురించి మౌఖిక సంప్రదాయంలో
తెలిసే విషయాలు చూస్తే వాటి నిండా మతం, మార్మికతా నిండి ఉన్నాయి. ఆయన ఎప్పుడూ గణిత
ప్రపంచంలో తిరుగుతుండేవాడు. గుర్తుతెలియని సంకేతాలు, చిక్కుముడుల భాష ఆయనది. ఆయన
మేధస్సు అత్యంత సూక్ష్మమైన పరమాణువు నుంచి మొదలుకొని అనంతమైన పరబ్రహ్మం వరకూ ఆలోచిస్తూండేది.
రామానుజన్ గణితం మనకు సాధారణంగా ఏదో
గ్రహాంతరమైన విషయంలా, మనకు అందే విషయం కాదని తరచుగా అనిపిస్తుంది. కానీ రామానుజన్ సిద్ధాంతాలు
మనం రోజూ వాడే మామూలు సంఖ్యల ధర్మాలే. ఇవాళ వాటిని ఆధునిక శాస్త్ర సాంకేతిక
రంగాల్లోని వివిధ క్షేత్రాల్లో విస్తృతంగా వినియోగిస్తున్నారు. పోలిమెర్
కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ నుంచి క్యాన్సర్‌కు
న్యూక్లియర్ థెరపీ వరకూ రామానుజన్ సిద్ధాంతాలు ఉపయోగపడుతున్నాయి.
శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22న
తమిళనాడులోని ఈరోడ్‌లో ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. నమక్కల్ ప్రాంతానికి
చెందిన నామగిరిదేవి (Namagiri Devi)
వారి ఇలవేల్పు. ఆ కుటుంబం రామానుజన్‌ను
సాక్షాత్తూ ఆ పరదేవతే తమకు ఇచ్చిన కానుకగా భావించారు. దక్షిణభారతదేశపు ప్రఖ్యాత
సాంస్కృతిక కేంద్రం, కావేరీ నది ఒడ్డున ఉన్న పుణ్యక్షేత్రంలో గడిపిన బాల్యం, తన
తల్లి జీవితంతో పెనవేసుకుపోయిన సంప్రదాయిక విలువలూ రామానుజన్ మీద గణనీయమైన
ప్రభావం చూపించాయి. రామానుజన్‌కు సంస్కృత సాహిత్యం, పురాణాలు, ఇతిహాసాలు అంటే మాత్రమే
కాదు, వాటిలోని తాత్వికత అంటే కూడా అత్యంత అభిమానం. రామానుజన్ పెద్దలను అడిగే ప్రశ్నలు
విశ్వాసాన్నీ, తాత్వికతనూ, తర్కాన్నీ ప్రేరేపించేలా ఉండేవి.
విద్యార్ధిగా రామానుజన్ ఒక అద్భుతం.
పెద్ద తరగతుల పిల్లలు సైతం కఠినమైనవిగా భావించే సమస్యలను చాలా సులువుగా
పరిష్కరించడం ద్వారా రామానుజన్ అందరినీ అబ్బురపరిచేవాడు. అసలు రామానుజన్ ఆలోచనలు
ఆయన ఉపాధ్యాయులు, సహచర విద్యార్ధులకు ఎప్పుడూ అర్ధమయ్యేవి కావు. తన గణిత ఆలోచనను తాత్విక,
ఆధ్యాత్మిక విషయాలతో కలిపి యువ రామానుజన్ గంటల తరబడి చేసే వ్యాఖ్యానాలు అందరినీ
కట్టిపడేసేవి. దైవం, సున్నా, అనంతం… ఈ మూడింటి మధ్యా సంబంధాన్ని కనుగొన్నానని చెప్పేవాడు.
అలా రామానుజన్ జీవితంలో గణితం, తత్వశాస్త్రం,
మతం, దైవం అనేవి పడుగు పేకల్లా కలిసిపోయాయి. ఇతరులు వేసిన గణిత మార్గాన్ని
అనుసరించడానికి రామానుజన్ ఎప్పుడూ వెనుకడుగు వేయలేదు. తాను అనుసరిస్తున్న
మార్గాన్ని ఇతరులు ఎంతవరకూ ప్రశంసించారు అన్న అంశంపై దృష్టి కేంద్రీకరించారు.
హార్డీని రామానుజన్ కనుగొన్నాడా లేక హార్డీయే
రామానుజన్ని గుర్తించాడా?
రామానుజన్ వదిలిపెట్టి వెళ్ళిపోయిన నోట్
పుస్తకాలు వాటంతట అవే ఒక విస్త్రత ప్రపంచం. గణిత ప్రపంచానికి సంబంధించిన అమూల్యమైన నిధి
అది. అందులో శుద్ధగణితపు మొగ్గలు ఎన్నో విరిసాయి, వాటి సువాసనలను నలుదెసలా
వెదజల్లాయి. వాటి ప్రయోజనం ఏమిటి, వాటిని ఎవరు వాడుకుంటారు… అని ఆయన
ఆలోచించలేదు. వాటిలో ఒక చిన్న సిద్ధాంతం గురించి తెలిసినప్పుడు కేంబ్రిడ్జి
ప్రొఫెసర్ హెచ్‌జీ హార్డీ (H G
Hardy) ఆశ్చర్యపోయాడు. రామానుజన్ ప్రతిపాదించిన
సిద్ధాంతాలు ఇంటిగ్రల్ నంబర్ థియరీకి (Integral
Number Theory) అత్యంత ఆధునిక మార్గాలు అని గ్రహించి
ఆశ్చర్యపోయాడు. అప్పటి గణిత ప్రపంచంలో ప్రఖ్యాతుడైన లెజెండ్రే రూపొందించగా, గాస్
సవరించిన సిద్ధాంతాలవి. రామానుజన్ సిద్ధాంతాలు వాటి సైద్ధాంతిక బలం వల్ల కాక, వాటి
అరుదైన స్వభావం వల్ల హార్డీ దృష్టిని ఆకర్షించాయి. అవి చూసి హార్డీ అదిరిపోయాడు.
మొత్తం కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయమే గజగజలాడింది. పోర్ట్ ట్రస్ట్‌లో గుమస్తాగా
ఉన్న రామానుజన్‌ను మూఢనమ్మకాలు, ఈతిబాధల సంకెళ్ళ నుంచి తప్పించి, హార్డీ అతన్ని
ట్రినిటీ కాలేజీలో పరిశోధకుణ్ణి చేసాడు. పాశ్చాత్య ప్రపంచం దోషరహితం అనే భావన అధికంగా
ఉన్న కలోనియల్ సమాజంలో కనీసం డిగ్రీ కూడా పూర్తి చేయలేకపోయిన గణిత మేధావి రామానుజన్‌ను
హార్డీ గుర్తించగలిగాడు. అతను రామానుజన్‌లోని నిగూఢ ప్రతిభను భవిష్యత్ జ్ఞానం కోసం
ఉపయోగించాడు. అందుకే రామానుజన్ మేధోసంపత్తితో పాటు హార్డీ ఆలోచన, ప్రతిభ కూడా ముఖ్యమైనవే.
రామానుజన్ భగవంతుణ్ణి మాత్రమే కాదు,
జ్యోతిషం (Astrology) వంటి దృగ్విషయాలను సైతం విశ్వసించాడు. తన నిరంతర సాధన ద్వారా
రామానుజన్ కొత్తకొత్త గణిత సిద్ధాంతాలను నిర్మించడం కొనసాగించాడు. ఒక సంగీతవేత్త
స్వరస్థానాలను మేళవించి కొత్త మేళరాగాలను రూపొందించినట్లే రామానుజన్ గణితంలో కొత్త
సిద్ధాంతాలను ఆవిష్కరించాడు. రామానుజన్ సిద్ధాంతాలు ఎప్పుడూ తప్పు కావు, కానీ అవి
అందరూ అర్ధం చేసుకునేంత సులభంగా ఉండేవి కావు. గణితానికి చెందిన ఎన్నో భావనలను
రామానుజన్ ఆవిష్కరించాడు. అతని విషయంలో సృజనాత్మకత, విమర్శాత్మక ఆలోచన పెనవేసుకుని
ఉండేవి. వాటిద్వారానే అతడు ఎన్నో సిద్ధాంతాలను నేరుగా ప్రతిపాదించేవాడు. అయితే
అవన్నీ తర్కరీత్యా ఎంతో ముఖ్యమైనవి. హార్డీ వంటి గణితజ్ఞుల ఆలోచనలను కూడా
ప్రభావితం చేసి, మార్చేసాయి. అందుకే రామానుజన్ గురించి హార్డీ ఇలా అన్నాడు. ‘‘ఆ
గణితశాస్త్రవేత్త తన అంతఃప్రేరణలో సిద్ధాంతాలను దర్శించేవాడు. ఆ సిద్ధాంతం సత్యమని
దాని ముగింపు ద్వారా నిరూపణ అయేది. ఇక ఆ సిద్ధాంతాన్ని రూపొందించే ప్రక్రియ ఆ
తర్వాత జరిగేది.’’
మార్మికత, గణితం, దైవత్వం (Mystics, Mathematics and Divinity)
కేంబ్రిడ్జ్ శాస్త్రవేత్తలు అజ్ఞేయవాదులు
లేదా నాస్తికులు. కానీ రామానుజన్ ఆస్తికుడు మాత్రమే కాక జ్యోతిషం వంటి వాటిని కూడా
విశ్వసించేవాడు, తన జీవితంలో ఆ ఆచార సంప్రదాయాలను పాటించేవాడు. అంతేకాదు, స్వయంగా
రామానుజన్ జ్యోతిషంలో గొప్ప పండితుడు. అదేసమయంలో మిగతా గణితశాస్త్రవేత్తల్లాగే
అతను తార్కిక ఆలోచనలోనూ, వైజ్ఞానిక దృక్పథంలోనూ ఏమాత్రం వెనుకబడినవాడు కాదు. ఆ
లక్షణం చాలామంది పాశ్చాత్య శాస్త్రవేత్తలను అబ్బురపరిచింది. స్వయంగా హార్డీ ఒక
నాస్తికుడు, హేతువాది, దేవుడంటే నమ్మకం లేనివాడు. అతను రామానుజన్ యొక్క ఈ
లక్షణాన్ని ప్రాచ్యప్రపంచపు ధర్మంగా అంచనా వేసాడు. రామానుజన్ గురించి ఇ.టి బెల్
ఇలా వ్యాఖ్యానించాడు, ‘‘రామానుజన్‌కు అతీంద్రియమైన అంతర్దృష్టి ఉంది. బైటకు
ఏమాత్రం సంబంధం లేనివిగా ఉండే సూత్రాల మధ్య దాగి ఉన్న సంబంధాలను సైతం కనుగొనగలిగేవాడు.
అది అతనికి స్వర్గం నుంచి అందిన కానుక.’’ రామానుజన్ ఆలోచనల ఎదుగుదల క్రమాన్ని
కనుగొనడానికి పాశ్చాత్య విద్వాంసులు చేసిన ప్రయత్నాలు ఎంతకీ నెరవేరలేదు. ఇవాళ
సూడోసైన్స్, మూఢనమ్మకాలుగా ప్రచారం చేస్తున్న భారతీయ తత్వశాస్త్రం, జ్యోతిషం,
వాటికి సంబంధించిన ఆచార సంప్రదాయాలను రామానుజన్ ఏనాడూ వదలకుండా బలంగా పట్టుకుని
ఉండేవాడు. అవి అతని గణిత విశ్లేషణా శక్తికి ఎలా ఉపయోగపడ్డాయన్నది నేటికీ ఎవరికీ అంతుచిక్కలేదు.
జ్యోతిషంలోను, తమ ఇలవేల్పు నామగిరిదేవిలోనూ రామానుజన్ విశ్వాసం వల్ల అతన్ని
శాస్త్రవేత్తగా గుర్తించకూడదంటూ కొంతమంది విమర్శించారు కూడా. పాశ్చాత్యుల ఆ
ఆలోచనాధోరణినే పట్టుకుని కొంతమంది భారతీయులు కూడా రామానుజన్‌ను విమర్శించారు. కానీ
అలాంటి వ్యాఖ్యలు, విమర్శలు రామానుజన్ మీద ఎలాంటి ప్రభావమూ చూపలేకపోయాయి. తన గణిత
ఆవిష్కరణలన్నీ నామగిరిదేవి ఆశీర్వాదం వల్ల కలిగిన స్ఫురణలేనని రామానుజన్
విశ్వసించాడు, ఆ కీర్తిని ఆమెకే ఆపాదించాడు.
రామానుజన్ ఓ విలక్షణమైన
భారతీయ గణిత శాస్త్రవేత్త. ఆయన ద్వారా ప్రపంచానికి భారతీయ గణితశాస్త్రపు విశిష్టత వెల్లడయింది.
ఆయన పుట్టినరోజున జాతీయ గణిత దినంగా జరుపుకోవడం మనకు గణితశాస్త్రంలో మన దేశపు ఘన
వారసత్వం గురించి గర్వించడానికి, దాన్ని మరింత తెలుసుకుని ప్రచారం చేసుకునే అవకాశం
కల్పించింది. వేదకాలం నుంచీ గణితప్రపంచానికి భారతదేశం అందించిన అమూల్యమైన సేవలను
నిశితంగా అర్ధం చేసుకోడానికి దారి చూపింది. భారతదేశపు తాత్విక వారసత్వాన్ని
పునరుద్ధరించి, తన స్వల్ప జీవితకాలంలో పాశ్చాత్య ప్రపంచం ముందు ప్రకటించిన స్వామి
వివేకానందలాగే, రామానుజన్ కూడా ప్రపంచ యవనికపై మన గణిత సంప్రదాయాన్ని ప్రకటించి,
భారతదేశాన్ని పాశ్చాత్యులు చూసే దృక్కోణాన్ని మార్చివేసిన మహనీయుడు. దురదృష్టం
ఏంటంటే ఆ ఘన వారసత్వానికి గర్వించేలా రామానుజన్ భారతీయులను ఉద్దీప్తం చేయలేకపోయాడు. ఇప్పటికైనా మన దేశీయ విద్యావిధానం
గణితంలోనూ, ఇతర రంగాల్లోనూ భారతదేశపు అద్భుతమైన వారసత్వాన్ని వెలికితీసి
ప్రపంచానికి మన ఘనతను చాటిచెప్పాలి.