మణిపూర్
లో మళ్ళీ హింసాత్మక ఘటన చేలరేగింది. మయన్మార్ సరిహద్దు సమీపంలో రెండు తెగల మధ్య
జరిగిన కాల్పుల్లో 13 మంది ప్రాణాలు కొల్పోయారు. మయన్మార్ వైపు వెళుతున్న సాయుధుల
సమూహంపై మరో గుంపు కాల్పులు జరపడంతో మరణాలు సంభవించినట్లు అధికారులు చెబుతున్నారు.
తెంగ్నౌపాల్
జిల్లాలోని లియితో గ్రామ పరిధిలో
మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. అంతర్జాతీయ సరిహద్దుకు పది కిలోమీటర్ల దూరంలో ఈ
ప్రాంతం ఉంటుంది. మృతదేహాలను ఇంపాల్ లోని జవహర్లాల్ ఇన్సిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్
క్యాంపస్‌లో భద్రపరిచారు.
కాల్పుల
ఘటనను ధృవీకరించిన మణిపూర్ పోలీసులు, సోమవారం నాడు సాయిబోల్ లీతావో గ్రామపరిధిలో
గుర్తు తెలియని సాయుధ దుండగుల మధ్య జరిగిన కాల్పుల ఘటనలో 13 మంది మరణించారని తెలిపారు.
స్థానిక పోలీసులతో పాటు భద్రతా దళాలు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టాయి.
కాల్పుల్లో మరణించిన వారు ఆ ప్రాంతానికి చెందిన వారు కాదని, వారు అజ్ఞాత దళాల
సభ్యులై ఉండొచ్చు అని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ
ఘటనకు సంబంధించిన వీడియో అంటూ సోషల్ మీడియా చక్కర్లు కొడుతున్న ఓ వీడియో క్లిప్ పై
పోలీసులు స్పష్టత ఇచ్చారు. అది నకిలీ వీడియో అని తేల్చిచెప్పారు. తప్పుడు వార్తలు
ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ ఏడాది మే 3న మణిపూర్‌లోని మొయితీ, కుకీ తెగల మధ్య ఘర్షణలు చెలరేగగా 182 మంది ప్రాణాలు కోల్పోయారు.
దాదాపు 50 వేల మంది
నివాసాలను కోల్పోయారు. ఇటీవలే పరిస్థితి అదుపులోకి రావడంతో ఆదివారమే ఇంటర్నెట్
సేవలు పునరుద్ధరించారు.