మాల్దీవుల్లో మోహరించిన భారత సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు భారత్ అంగీకరించినట్లు ఆ దేశ నూతన అధ్యక్షుడు మహ్మద్ మయిజ్జు ప్రకటించారు. దుబాయ్లో జరుగుతోన్న పర్యావరణ సదస్సు కాప్ 28 సమావేశాల సదర్భంగా, మయిజ్జు, ప్రధాని మోదీని కలిశారు. ఈ భేటీలో ప్రధాని మోదీతో పలు అంశాలను చర్చించారు. తమ దేశంలో ఉన్న భారత్ దళాలను వెనక్కు పిలిపించాలని మయిజ్జు ప్రధానిని కోరారు. అందుకు ప్రధాని మోదీ అంగీకరించినట్లు మహ్మద్ మయిజ్జు తెలిపారు.
మాల్దీవుల అభివృద్ధికి ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటుకు కూడా ప్రధాని మోదీ అంగీకరించినట్లు ఆయన చెప్పారు. ఆర్థిక సంబంధాలతోపాటు తమ దేశ సంబంధాలను మరింత మెరుగు పరుచుకునే అంశాలపై చర్చించినట్లు మయిజ్జు ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. ప్రస్తుతం 70 మంది భారత దళాలు మాల్దీవుల్లో పనిచేస్తున్నాయి. రాడార్ స్టేషన్లు, నిఘా విమానాల నిర్వహణ బాధ్యతలను వారు నిర్వహిస్తున్నారు. ఎన్నికల హామీల్లో భాగంగా మయిజ్జు భారత బలగాలు వెనక్కు పిలిపించుకోవాలని కోరారు. తాము పూర్తిగా స్వతంత్రంగా ఉండాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.