తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలకు కేంద్రంగా నిలిచిన నాగార్జునసాగర్ ప్రాజెక్టును (nagarjuna sagar project) కేంద్ర బలగాలకు అప్పగించారు. 30వ తేదీ అర్థరాత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ ప్రాజెక్టు 13వ గేటు వద్ద కంచె వేసి పోలీసుల పహారా పెట్టడంతో వివాదం మొదలైంది. తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరవాత నీటి పంపిణీ బాధ్యతను కృష్ణా వాటర్ బోర్డ్ పర్యవేక్షిస్తోంది. అయితే నాగార్జునసాగర్ ప్రాజెక్టు నిర్వహణను మాత్రం తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించారు.
తాజాగా తలెత్తిన వివాదం పరిష్కారమైంది. నాగార్జునసాగర్ ప్రాజెక్టు రక్షణ బాధ్యతలను కేంద్ర బలగాలకు అప్పగించేందుకు ఏపీ, తెలంగాణ అంగీకరించాయి. ఇవాళ మధ్యాహ్నం నాటికి మొత్తం ప్రాజెక్టు కేంద్ర బలగాల చేతిలోకి వెళ్లనుంది. ఇప్పటికే సీఆర్పీఎఫ్ బలగాలు విజయపురి సౌత్ వద్దకు చేరుకున్నారు. ఒక్కో పాయింట్ స్వాధీనం చేసుకుంటున్నారు. మరోవైపు నాగార్జునసాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. కుడి కాలువ ద్వారా నాలుగు వేల క్యూసెక్కుల నీటి విడుదల ఇంకా ఆపలేదు. ఇవాల నీటి విడుదల ఆపే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.