TN farmers calls for
statewide protest against false cases
తిరువణ్ణామలై జిల్లాలో రైతులపై మోపిన
అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించాలంటూ తమిళనాడు రైతుసంఘం తీర్మానం చేసింది. మెల్మా-సిప్కాట్
ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ నిరసన చేపట్టిన రైతులపై తమిళనాడు కేసులు పెట్టడంపై రైతుసంఘం
ఆగ్రహం వ్యక్తం చేసింది.
వ్యవసాయవేత్త, రైతుల నాయకుడు ఎ అరుళ్
మీద గూండా యాక్ట్ ప్రకారం పెట్టిన కేసులు ఉపసంహరించుకోవాలనీ… రైతుల మధ్య చిచ్చు
పెట్టేలా వ్యాఖ్యలు చేసిన మంత్రి ఈవీ వేలును క్యాబినెట్ నుంచి తొలగించాలనీ… స్టాలిన్
ప్రభుత్వాన్ని రైతుసంఘం డిమాండ్ చేసింది. వ్యవసాయ భూమి సేకరించాల్సిన అవసరం ఉన్న
ప్రాజెక్టులను అసలు చేపట్టవద్దంటూ హెచ్చరించింది.
తమిళనాడు రాష్ట్ర పరిశ్రమల ప్రమోషన్
కార్పొరేషన్ – సిప్కాట్ ఇటీవలచెయ్యార్ ప్రాంతంలో ఒక ప్రాజెక్టు మూడోదశ పనులు
చేపట్టింది. దానికోసం 3,174 ఎకరాల భూసేకరణ చేయాలని స్టాలిన్ సర్కారు
నిర్ణయించింది. ఆ ప్రతిపాదనకు అక్కడి గ్రామాల రైతులు ఒప్పుకోవడం లేదు. ప్రాజెక్టుకు
వ్యతిరేకంగా వారంతా ఆందోళన నిర్వహించారు. ఆ సందర్భంగా పలువురు రైతులను అరెస్ట్
చేసారు, గూండా యాక్ట్ ప్రకారం కేసులు పెట్టారు. దాంతో ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత
పెల్లుబికింది. దాన్ని గుర్తించిన స్టాలిన్, ఆరుగురు రైతులపై కేసులు
ఉపసంహరించుకుంది.
ప్రభుత్వ చర్యలను సమర్థించుకునే క్రమంలో,
మంత్రి వేలు నోటికి వచ్చినట్లు మాట్లాడాడు. ప్రభుత్వం ఉద్దేశం ఉద్యోగాలు కల్పించడం
మాత్రమే అని చెబుతూ, ‘బైట నుంచి వచ్చినవారే’ సమస్యకు కారణమని వివాదాస్పద ఆరోపణలు
చేసాడు. పర్యావరణవేత్త అరుళ్ రెచ్చగొట్టిన కారణంగానే రైతులు గొడవలు చేస్తున్నారని ఆరోపించాడు.
తమిళనాడులో అవినీతికి వ్యతిరేకంగా
పోరాడుతున్న అరప్పూర్ ఇవక్కమ్ అనే సంస్థ, ఆ ఆరోపణలు తప్పు అని రుజువు చేసే
వీడియోలను బైటపెట్టింది. రైతులను వదిలిపెట్టాలని డిమాండ్ చేసింది.
ముఖ్యమంత్రి స్టాలిన్ సైతం రైతుల మీద
గూండాయాక్ట్ ప్రయోగించడాన్ని మొదట సమర్థించాడు. అధికారులను అడ్డగించారు,
శాంతిభద్రతలకు విఘాతం కలిగించారు, కొందరు రైతులు తమ భూమిని ప్రభుత్వానికి
స్వచ్ఛందంగా ఇస్తుంటే అడ్డుపడ్డారు అన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న రైతులపై గూండా
యాక్ట్ ప్రయోగించడంలో తప్పే లేదని సీఎం స్థాయి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం గమనార్హం.
తొలుత ఏడుగురిని నిర్బంధించగా, వారిలో ఆరుగురి కుటుంబాలను లొంగదీసుకుని వారితో
తమకు అనుకూలంగా చెప్పించుకుని, ఆ ఆరుగురినీ విడిచిపెట్టారు. దేవన్ అనే రైతు
కుటుంబం మాత్రం దానికి లొంగలేదు.
మొత్తం మీద చెయ్యార్ ప్రాంతంలో పరిస్థితి
ఇంకా ఉద్రిక్తంగానే ఉంది. భూసేకరణకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన కొనసాగిస్తున్నారు.
వారికి అండగా, రాష్ట్రవ్యాప్తంగా రైతులు సైతం నిరసన కార్యక్రమాల్లో
పాల్గొంటున్నారు.