ఉత్తరప్రదేశ్ లోని పాలక బీజేపీ మరో
కీలక నిర్ణయం తీసుకుంది. హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులను నిషేధిస్తూ సీఎం యోగీ
ఆదిత్యనాథ్ ఉత్తర్వులు జారీ చేశారు. హలాల్
సర్టిఫికెట్ తో కూడిన ఆహార ఉత్పత్తుల తయారీ, నిల్వ, పంపకం, అమ్మకాలను తక్షణమే
నిషేధిస్తున్నట్లు యూపీ ప్రభుత్వం వెల్లడించింది. ఎగుమతుల విషయంలో ఎలాంటి ఆంక్షలు
లేవని స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన
చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ ఉన్నతాధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఆహార పదార్థాల నాణ్యత విషయంలో హలాల్ సర్టిఫికెట్
సమాంతర వ్యవస్థగా మారడంతో గందరగోళం తలెత్తోంది.
ఆహార భద్రతా చట్టం ప్రమాణాల ప్రకారం
హలాల్ గుర్తింపు సరికాదు అని ఉత్తర్వుల్లో పేర్కొన్న ప్రభుత్వం, ఆహార పదార్థాల నాణ్యతను నిర్ణయించే అధికారంలో చట్టంలోని
సెక్షన్ 29లో పేర్కొన్న అధికారులు, సంస్థలకు మాత్రమే ఉంటుందని స్పష్టం చేసింది. సదరు
అధికారులు, సంస్థలు మాత్రమే నిబంధనలు మేరకు ఆహార ఉత్పత్తులు ఉన్నాయా లేవా అని
తనిఖీ చేస్తారని వివరించింది.
కొన్ని రకాల ఔషధాలు, వైద్య పరికరాలు,
సౌందర్య ఉత్పత్తులు హలాల్ ధ్రువీకరణతో విక్రయిస్తున్నారు. అయితే అందుకు చట్టపరమైన
ఆమోదం లేదని ప్రభుత్వం వివరించింది.
పలు కంపెనీలు మతం పేరిట ప్రజలను మోసగిస్తుండటంతో
ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. నకిలీ హలాల్ సర్టిఫికెట్ తో పలు సంస్థలు వివిధ
వస్తువులను ప్రజలకు విక్రయిస్తున్నాయి. తమ అమ్మకాలను పెంచుకునేందుకు మతాన్ని
వాడుకోవడంపై కేసు నమోదు కావడంతో ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
హలాల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్
చెన్నై, జమియత్ ఉలేమా-ఎ-హింద్ హలాల్
ట్రస్ట్ దిల్లీ, హలాల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ముంబై, జమియత్ ఉలామా మహారాష్ట్ర సహా పలు కంపెనీలు మతపరమైన
మనోభావాలతో ప్రజలను మోసం చేస్తున్నాయని, సదరు ధ్రువపత్రం లేని ఇతర కంపెనీల
విక్రయాలను తగ్గించేందుకు కుట్ర చేస్తున్నాయని ఫిర్యాదు అందడంతో ప్రభుత్వం దిద్డుబాటు
చర్యలు చేపట్టింది.
ఆయా కంపెనీలు తమ ఆర్థిక ప్రయోజనాల కోసం
నకిలీ హలాల్ సర్టిఫికెట్లు మంజూరు చేశాయని, సామాజిక విద్వేషాన్ని పెంచుతూ ప్రజల నమ్మకాన్ని వమ్ము చేస్తున్నాయని యూపీ ప్రభుత్వం తెలిపింది.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు