Congress MP says Netanyahu
should be shot and killed
తమపై ఏకపక్ష దాడి మొదలుపెట్టిన హమాస్‌తో పోరాడుతున్న
ఇజ్రాయెల్ గురించి మన దేశంలో ప్రతిపక్షాల వైఖరి చూస్తూనే ఉన్నాం. ముస్లిముల
సంతుష్టీకరణే లక్ష్యంగా రాజకీయాలు చేసే అన్ని పార్టీలూ ఇజ్రాయెల్ తప్పులను లెక్కపెడుతున్నాయి
తప్ప హమాస్ ఊసే ఎత్తడం లేదు. అందునా కాంగ్రెస్ ఐతే మరీనూ. ముస్లిముల ఓట్ల కోసం ఎంతకైనా
దిగజారుతోందా పార్టీ.
తాజాగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన కేరళ
ఎంపీ రాజమోహన్ ఉన్నిథాన్ దారుణమైన వ్యాఖ్యలు చేసారు. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి
బెంజమిన్ నెతన్యాహును ‘ఏ విచారణా లేకుండా కాల్చి చంపిపారెయ్యాలి’ అన్నారు.
కాసరగోడ్‌లో పాలస్తీనాకు సంఘీభావంగా నిర్వహించిన ర్యాలీలో ఆయన ప్రసంగిస్తూ ఈ
సంచలనాత్మక వ్యాఖ్య చేసారు. రెండో ప్రపంచయుద్ధంలో సామూహిక జనహననకాండకు పాల్పడిన
నాజీలపట్ల అవలంబించిన పద్ధతినే ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మీదా ఉపయోగించాలని
బహిరంగంగా ప్రకటించారు.
‘‘జెనీవా ఒప్పందాన్ని ఉల్లంఘించినవారిని
ఏం చేయాలని మీరు అడగవచ్చు. రెండో ప్రపంచయుద్ధం తర్వాత యుద్ధనేరాలకు పాల్పడిన
నాజీలను న్యూరెంబర్గ్ అనేచోట విచారించారు. ఆ విచారణ మోడల్ ఏంటంటే, యుద్ధనేరాల
నిందితులను ఎలాంటి విచారణా లేకుండా కాల్చిపారేయడమే. ఇజ్రాయెల్ ప్రధానమంత్రి విషయంలోనూ
అదే పద్ధతి అనుసరించడం తక్షణావసరం. ఇవాళ బెంజమిన్ నెతన్యాహు ప్రపంచం ముందు ఒక
యుద్ధ నేరస్తుడిలా నిలబడి ఉన్నాడు. పాలస్తీనా ప్రజల పట్ల నెతన్యాహు, అతని బలగాలు చేస్తున్న
దారుణాలకు, అతన్ని ఎలాంటి విచారణా లేకుండానే కాల్చిచంపిపారెయ్యాల్సిందే’’ అని
ప్రసంగించారు రాజమోహన్ ఉన్నిథాన్.
రాజమోహన్ ఉన్నిథాన్ నటన నుంచి
రాజకీయాల్లోకి వచ్చి ప్రస్తుతం కాసరగోడ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ఈ వ్యాఖ్యలు చేసిన సమావేశాన్ని
కాసరగోడ్ యునైటెడ్ ముస్లిం జమాత్ సంస్థ శుక్రవారం నిర్వహించింది. అంతకుముందు,
కాంగ్రెస్ నాయకుడు జైరాం రమేష్ తమ పార్టీ తరఫున అధికారికంగా ఒక ప్రకటన చేసారు.
గాజాలో ఇజ్రాయెల్ ఆపరేషన్స్‌ని ఖండిస్తూ, అక్కడ కాల్పుల విరమణ అమల్లోకి తేవడానికి
మన కేంద్రప్రభుత్వం జోక్యం చేసుకోవాలని ఆ ప్రకటనలో కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది.
మరోవైపు, పాలస్తీనా భూభాగాల్లో
జరుగుతున్న దారుణమైన నేరాల గురించి విచారణ జరపాలంటూ అంతర్జాతీయ నేరాల న్యాయస్థానం
ఐసీసీకి దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్, బొలీవియా, కొమొరోస్, డిజిబౌటి దేశాలు సంయుక్తంగా
విన్నవించాయి.