తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు పార్టీలు హామీలను గుప్పిస్తున్నాయి. ఇప్పటికే పలు పార్టీలు మేనిఫెస్టోలను విడుదల చేయగా, తాజాగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను (Telangana Congress Manifesto) విడుదల చేసింది. హైదరాబాద్లోని గాంధీభవన్లో ఆ పార్టీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. ఆరు గ్యారంటీలు, 36 ఇతర అంశాలతో మేనిఫెస్టో విడుదల చేశారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలంతోపాటు, గౌరవభృతి ప్రకటించారు.
మహాలక్ష్మి పథకం ద్వారా మహిళలకు ప్రతి నెలా రూ.2500, రూ.500లకే గ్యాస్ సిలిండర్ ప్రకటించారు. రైతు భరోసా కింద ఏటా రైతులకు ఎకరాకు రూ.15000, కూలీలకు రూ.12000 , వరి పంటకు క్వింటాకు రూ.500 బోనస్ హామీ ఇచ్చారు. ఇళ్లులేని పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మాణానికి ఒక్కొక్కరికి రూ.5 లక్షలు ఉచితంగా ఇవ్వనున్నారు. యువ వికాసం కింద విద్యార్ధులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు అందిస్తారు. చేయూత కింద రూ.4000 పింఛను, రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అందించనున్నారు.