Bihar caste survey
report second tranche
బిహార్ కులగణన నివేదిక రెండో భాగాన్ని
ఇవాళ రాష్ట్ర అసెంబ్లీ ముందు ప్రవేశపెట్టారు. ఈ రెండో విడత నివేదికలో రాష్ట్రంలోని
215 షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన తరగతులు, అత్యంత వెనుకబడిన
తరగతుల వారి ఆర్థిక స్థితిగతులను ప్రకటించారు.
నివేదికలోని వివరాల ప్రకారం ఎస్సీ,
ఎస్టీల్లో 42శాతానికి పైగా ప్రజలు… బీసీలు, ఈబీసీల్లో 33శాతానికి పైగా పేదరికంలో
మగ్గుతున్నారు. ఎస్సీల్లో 12వ తరగతి పూర్తి చేసినవాళ్ళు 6శాతం కంటె తక్కువ.
ఈ నివేదికపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్
షా ఆరోపణలు చేసారు. బిహార్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా యాదవులు, ముస్లిముల జనాభాను
ఎక్కువ చేసి చూపడం ద్వారా ఈబీసీల హక్కులకు భంగం కలిగిస్తోందని ఆరోపించారు. బిహార్
ఉపముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ ఆ వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. ‘‘యాదవులు
వెనుకబడినవారు కాదా? శాస్త్రీయ గణాంకాలను తప్పుల తడకలు అని ఎలా అంటారు?’’ అని
మండిపడ్డారు.
గతనెల విడుదల చేసిన మొదటి విడత కులగణన సమాచారం
ప్రకారం బిహార్ జనాభాలో 60శాతానికి పైగా ప్రజలు బీసీలు, ఈబీసీలున్నారు. 20శాతానికి
పైగా జనాలు ఎస్సీ ఎస్టీలున్నారు.
ఆర్థిక సమాచారం
బిహార్ ప్రభుత్వం చేపట్టిన కులగణన రెండో
విడత సమాచారం ప్రకారం… 13.1కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో 34.13 శాతం కుటుంబాలకు
ఆదాయం రూ.6వేల కంటె తక్కువే. రాష్ట్రంలో 29.61శాతం మంది రూ.10వేల కంటె తక్కువ
ఆదాయంతో బతుకుతున్నారు. సుమారు 28శాతం రూ.10వేల నుంచి రూ.50వేల మధ్య ఆదాయంతో
జీవిస్తున్నారు.
మొత్తంగా చూస్తే ఎస్సీల్లో 42.93శాతం
కుటుంబాలు, ఎస్టీల్లో 42.70శాతం కుటుంబాలు, బీసీల్లో 33.16శాతం కుటుంబాలు,
ఈబీసీల్లో 33.58శాతం కుటుంబాలూ పేదరికంలో మగ్గుతున్నాయి. జనరల్ కేటగిరీలో కేవలం
25.09శాతం మంది పేదవారున్నారు. అందులో 25.32శాతం మంది భూమిహార్లు, 25.3శాతం
బ్రాహ్మణులు, 24.98శాతం మంది రాజ్‌పుత్‌లు పేదలుగా ఉన్నారు. బిహార్ జనాభాలో
బ్రాహ్మణులు, రాజ్‌పుత్‌లు కలిపి 7.11శాతం జనాభా ఉన్నారు, అలాగే భూమిహార్లు
2.86శాతం జనాభా ఉన్నారు.
ఇక బీసీల విషయానికి వస్తే, యాదవుల్లో 35.87శాతం
మంది, కుశ్వాహాల్లో 34.32శాతం మంది, కుర్మీల్లో 29.9శాతం మంది పేదలు ఉన్నారని తాజా
కులగణన చెబుతోంది. బిహార్ జనాభాలో యాదవులు 14.26శాతం మంది ఉన్నారు. రాష్ట్రంలోని
ఓబీసీల్లో యాదవుల జనసంఖ్యే ఎక్కువ. మిగతా ఓబీసీలు 8శాతం కంటె కొంచెం ఎక్కువ.
ఈబీసీల్లో సగటున 30శాతానికి పైగా కుటుంబాలు
పేదరికంలో ఉన్నాయి. వివరంగా చూస్తే… తేలీల్లో 29.87శాతం, కానూల్లో 32.99శాతం,
చంద్రవంశీల్లో 34.08శాతం, ధనుక్‌లలో 34.75శాతం, నోనియాల్లో 35.88శాతం పేదరికంలో
మగ్గుతున్నారు.
బిహార్‌లో అక్షరాస్యత
బిహార్‌లో మొత్తం అక్షరాస్యత 79.7శాతం
ఉంది. ఐదో తరగతి వరకూ చదువుకున్నవాళ్ళు 22.67శాతం మంది ఉన్నారు. ఎస్సీల్లో ఐదో
తరగతి వరకూ చదువుకున్నవారు 24.31శాతం కాగా ఈబీసీల్లో 24.65శాతం మంది ఉన్నారు. ఇక
జనరల్ కేటగిరీలో ఐదో తరగతి వరకూ చదువుకున్నవారు 17.45శాతం మంది మాత్రమే.
ఎస్సీల్లో 11, 12 తరగతుల వరకూ చదువుకున్న
వారు 5.76శాతం మంది మాత్రమే ఉన్నారు. మిగతా కులాలు అన్నింటిలో కలిపి 9శాతం మంది
11, 12 తరగతుల వరకూ చదువుకున్నారు.
బిహార్ కులగణన మొదటి నివేదిక విడుదలైన
తర్వాత దేశవ్యాప్తంగా కులగణన జరిపించాలన్న డిమాండ్లు ఊపందుకున్నాయి. ప్రత్యేకించి
ఇవాళ్టి నుంచీ మొదలైన ఐదు రాష్ట్రాల శాసనసభల ఎన్నికలు, 2024లో జరగబోయే లోక్‌సభ ఎన్నికల
నేపథ్యంలో కులగణన డిమాండ్లు పెరిగాయి.
కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ గతంలో
కులగణన డిమాండ్ల పట్ల పెద్ద సానుకూలంగా లేదు. అయితే ఈ విషయమై ఈ వారంలో విధానపరమైన
నిర్ణయం తీసుకునే అవకాశముందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా సూచనప్రాయంగా చెప్పారు.
తమ పార్టీ కుల గణనను ఎప్పుడూ వ్యతిరేకించలేదని, ఆ విషయమై తగిన చర్చలు సంప్రదింపులు
జరగాల్సిన అవసరాన్ని మాత్రమే ప్రస్తావించామనీ ఆయన చెప్పారు.
బిహార్ కులగణన మొదటి దశ
నివేదిక విడుదలైన తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీష్ సర్కారుపై
విరుచుకుపడ్డారు. దేశాన్ని కులాల పేరిట విభజించడానికి ప్రయత్నిస్తున్నారంటూ
దుయ్యబట్టారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ తాము అధికారంలోకి వచ్చే రాష్ట్రాల్లో
కులగణన జరిపిస్తామనీ ప్రకటించింది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో గెలిస్తే
దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని రాహుల్ గాంధీ చెప్పారు.
హనుమంతుడు ముస్లిం, నమాజ్ చేసేవాడు: ముస్లిం ఉపాధ్యాయుడి వివాదాస్పద వ్యాఖ్యలు