దేశవ్యాప్తంగా
పాఠ్య పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అనే పదాన్ని చేర్చాలనే ప్రతిపాదనకు జాతీయ
విద్యా పరిశోధన, శిక్షణామండలి(NCERT) ముందుకు వచ్చింది. ఈ ప్రతిపాదనను అమలు
చేయాలని కోరుతూ పాఠ్యపుస్తకాల రూపకల్పన కమిటీ సిఫార్సు చేసింది. జాతీయస్థాయిలో పాఠ్యపుస్తకాల సిలబస్, ఇతర ప్రణాళికలను
ఖరారు చేసేందుకు కేంద్రప్రభుత్వం ఈ ప్రత్యేక కమిటీని నియమించింది.
‘ప్రాచీనచరిత్ర’
పదానికి బదులు ‘ప్రామాణిక చరిత్ర’ అని పొందు పరచాలని నిర్ణయించినట్లు కమిటీ చైర్మన్ సీఐ ఇజాక్ తెలిపారు. పాఠ్య
పుస్తకాల్లో ఇండియా బదులు భారత్ అని చేర్చడంతో పాటు అన్ని తరగతుల్లో ఇండియన్
నాలెడ్జ్ సిస్టమ్ సబ్జెక్టు ప్రవేశపెట్టాలని ప్రతిపాదించారు.
యుద్ధాల్లో
హిందూ విజయాలను హైలైట్ చేయాలని కూడా కమిటీ సిఫార్సు చేసినట్లు వెల్లడించారు.
చరిత్రలో ఇప్పటి వరకు మన ఓటముల ప్రస్తావనే ఉందన్న ఇజాక్, మొగలులు, సుల్తానులపై మన
విజయాల గురించి ఎక్కడ ప్రస్తావించలేదన్నారు.
నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీకి తగ్గట్టు పాఠ్యపుస్తకాలు
రూపొందించేందుకు ఎన్సీఈఆర్టీ ప్రయత్నాలు చేపట్టింది. సిలబస్ తయారీ కోసం ఇటీవల 19
మందితో కొత్త కమిటీ వేశారు. ఈ కమిటీనే తాజా ప్రతిపాదనలు చేసింది. కేంద్రప్రభుత్వం , తన అధికారిక కార్యక్రమాల్లో
ఇండియా బదులు భారత్ పదాన్ని ఉపయోగించడం ఇప్పటికే మొదలు పెట్టింది. జీ-20
సమావేశాల్లోనూ భారత్ పేరును అధికారిక పత్రాల్లో ఉపయోగించారు.